పుట:Geetham Geetha Total.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

05.తే. అట్టు లాత్మనుపాసించునట్టి జనులు
చనెడుమార్గంబు మిగులఁగష్టంబు పార్థ !
ఇంద్రియాగోచరముగఁ జరించునాత్మఁ
జెందు టధికకష్టం బైన చేఁత సుమ్మి.

06. ఆ.సర్వకర్మములను సంపూర్ణముగ, మత్స
మర్పణం బొనర్చి మత్పరత, న
నన్యయోగసిద్ధి నభ్యాస మొనరించి
నాయుపాసనంబు సేయుజనుల.

07. తే.అర్జునా! వారు చిత్తంబులందు నన్ను
మఱవఁజాలక నాయందె మగ్ను లగుట
వారినెల్లను మృత్యుసం సారజలధి
దాఁటఁజేయుదు నేనతి త్వరితగతిని.

08. తే.మనసునం దనారతమును ననుఁ దలఁపుము;
బుద్ధియందును నన్నె సంశుద్ధిఁ గనుము;
అట్లు జేసిన, నీవు తదాది నన్నె
పొంది నాయందె నిలుతువు పుణ్యచరిత!

09. ఆ.చిత్తమును లయంబు స్ధిరరీతిఁ జేయంగ
శక్తి లేనియెడల సవ్యసాచి!
యట్టిశక్తి బొందు మభ్యాసయోగంబు
చేత నన్ను స్మరణఁ జేసికొనుచు.

10. తే.అందులకును సమర్థత నందవేని
నాదుకర్మంబు సేయు మ నారతంబు;
నాకొరకుఁ గర్మములఁ జేసి నను గిరీటి!
నన్నుఁ బొందుభాగ్యము గల్గు సన్నుతముగ.