పుట:Geetham Geetha Total.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23.తే. అఖిలజగములు గని భయం బందె ధారు
ణీశ ! గణనకు రానట్టి నీముఖములు
నేత్రములు బాహులూరువుల్నీపదములు
నీదు దంష్ట్రాకరాళ బహూదరములు.

24. ఆ. మింటి కెగయఁ బెరిఁగి మేలికాంతులవర్ణ
ములఁ జెలంగి వదనములను దెఱచు
నతివిశాలనేత్రుఁడగు నిన్నుఁ గనుటచే
ధృతియు శమముఁ దొలఁగె దేవదేవ!

25. తే.భూరిభీకరదంష్ట్రాళి ఘోరమగుచుఁ
బ్రళయకాలాగ్ని దీప్తిప్రభల వెలుంగు
వదనములఁ జూడ నాకు దిగ్భ్రమము గలిగె;
సుఖము నిడుమయ్య కరుణతోఁజూడుమయ్య.

26. తే.ధార్తరాష్ట్ర శతముఁ, దమకు సాయ మొనర్ప
వచ్చియున్న ధరణి పాలకులును,
ద్రోణభీష్మకర్ణ దుర్జ యానీకంబు,
మాకుఁ దోడు వచ్చు మనుజపతులు.

27. తే.క్రూరదంష్ట్రాళిఁ జెలఁగు నీ ఘోరవదన
జాలమందుఁ బ్రవేశింపఁ జనుట గంటి;
కోఱలకు మధ్యమునఁ దగుల్గొనినవారి
యుత్తమాంగంబు లాయెను దుత్తు నియలు.

28. తే.ఆబ్ధిలోపలఁ బడుటకై యతిరయమున
నెల్లతీర్థంబులును బ్రవహించురీతి
ఈమహాశూరు లెల్లరు నీముఖాగ్నిఁ
బడుటకొఱ కేఁగుచుంట గన్పడెడి దేవ!