పుట:Geetham Geetha Total.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29.తే. నాగముల వేయిశిరసుల భోగి నగుదు;
వనధి నివసించువారిలో వరుణుఁ డగుదు;
అర్యముఁడ నౌదుఁ బితరుల యందు నేను;
దండనాధికారులలో యముండ నేను.

30. తే. అమరవైరులయందుఁ బ్రహ్లాదుఁ డగుదు;
కాలుఁడను నేన భువినున్న కలయతులకు
మృగపతిని నేన సుమి యెల్ల మృగములందు;
వైనతేయుండ నగుదు నేఁ బక్షులందు.

31. తే. గమనవంతులయందు నే గాలి నగుదు;
శస్త్రపాణులలో రామ చంద్రుఁ డగుదు;
మత్స్యజాలంబులను నేను మకర మగుదు;
జాహ్నవిని నేన సుమి పుణ్య జలములందు.

32. తే. ఇల జనించెడు భూతకోటులకు నెల్ల
నాదిమధ్యలయంబులు నగుదు నేన;
విద్యలందును నధ్యాత్మవిద్య నేను;
వాద మొనరించువారల వాద మేను.

33. తే. అక్షరములం దకారంబ నగుదు నేన
వరసమాసంబులందు ద్వంద్వంబు నేన
అక్షయం బగుకాలంబు నగుదు నేన;
విశ్వతోముఖుఁ డగునట్టి విధిని నేన.

34. తే. ఎల్లవానిని హరియించు మృత్యు వగుదు;
పుట్టఁబోయెడువారికిఁ బుట్టు కగుదు;
స్త్రీలలో లక్ష్మి నేను; గీర్తియును స్మృతియు
వాగ్ధృతులు మేధయును క్షమాపణయు నేన.