పుట:Geetham Geetha Total.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత

అష్టమాధ్యాయము

అక్షర పరబ్రహ్మ యోగము


అర్జునుడిట్లనియె :-

01. ఆ. అట్టిబ్రహ్మమేది? యాత్మకాధారం బ
దేది? కర్మమేది? యేది భూత
ములకు నెలవు? దైవముల కేది దైవంబు?
ఎఱుఁగఁ జెప్పు మిప్పుడిరది రేశ!

02. ఆ. యజ్ఞములుఁ గ్రతువులు నాహార మెవనికి?
అతఁడు కాయ మెట్టులధివసించు?
నియమితాత్ము లెట్లు నిను దర్శన మొనర్పఁ
గలరు వారియంత్యకాలమందు?

 శ్రీ భగవంతడిట్లనియె :-

03. తే. ప్రకృతినిర్ముక్తశుద్ధాత్మ బ్రహ్మ మండ్రు;
ఆత్మ కాధారభూత మౌనండ్రు ప్రకృతి;
భూతభావంబులను భూమిఁ బుట్టునట్లు
ఘటన సేయు విసర్గమే కర్మ మండ్రు.

04. తే. పరఁగు నధిభూత మన, క్షరోభావ మగుచుఁ
బురుషు నధి దైవతంబుగా నెఱుఁగవలయు;
యజ్ఞముల కెల్ల భోక్త నేనగుదు సుమ్ము;
సర్వదేహంబులందుండి సవ్యసాచి !