పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపాలయాలు

ముక్కంటేశ్వరాలయం

గణపేశ్వరాలయానికి దక్షిణదిశలో ప్రధానాలయానికి దగ్గరలో ఈ ముక్కంటేశ్వరాలయం వుంది. దీనిలో ఒకే నిర్మాణంలొ పక్కపక్కనే మూడు అంతరాలయాలు ఒకే రంగమంటపం ద్వారా కలపబడి వుంటాయి. రంగమండపానికి ఒక్కో వరుసకు పది స్థంభాల వంతున మూడు వరుసల్లో ముప్పై స్థంభాలున్నాయి. ఇవిగాక ఆలయానికి ఉత్తర దిశగా ప్రధాన ఆలయం వైపుకు తోరణం (పోర్టికో) లాగా మరో రెండు స్తంభాలున్నాయి. వీటితో కలిపి మొత్తం 32 స్తంభాల ఈ మండపం చూసేందుకు చాలా అందంగా వుంది. వరుసగా వున్న మూడు అంతరాలయాల్లో మధ్యలో వున్న గర్భాలయం ప్రధానమైనది అని సూచిస్తున్నట్లుగా వుంటుంది. దాని ముందున్న నాలుగు స్థంబాలు ప్రత్యేకమైన శిల్ప నిర్మాణాన్ని కలిగివున్నాయి. ప్రధానాలయంలోని శిల్పం కంటే ఇక్కడి ఆలయంలోని శిల్పరీతి ఆకర్షణీయంగా వుంటుంది. మండపంలోని అందమైన హంసలవంటి శిల్పాలలోనూ, ఇతర శిల్పాలలోనూ సునిశితమైన పనితనం కనిపిస్తుంది. మూడింటి మధ్యలోని గర్భాలయానికి ఎదురుగా వున్న నాలుగు స్తంభాల మధ్య రంగమండపం వుంది. రెండు అంతరాలయాల్లో నిర్మాణపరంగా ఏమాత్రం దెబ్బతినని శివలింగాలు వున్నాయి. అవి ఈనాటికీ పూజకు నోచుకోలేదు.

ఈ ఆలయం ఉత్తర దిశకు తిరిగి వుండటం ప్రత్యేకత. ఈ ఆలయాన్ని రక్షిత కట్టడాల జాబితాలో చేర్చారు. అయినప్పటికీ మండపం పైన పిచ్చిమొక్కలు విపరీతంగా