పుట:Ganapati (novel).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

గ ణ ప తి

వారు తమలోఁ దమరు సరససల్లాపములు చేసికొను నప్పుడు మనకన్న గంగాధరుడు మిక్కిలి యదృష్టంతుఁడు. చదువు రాక యతఁడు నెలకు ముప్పది రూపాయలు సంపాదించుచుండఁగా మన మెన్నో పరీక్షలలోఁ గృతార్థులమై పదియేను రూపాయలు తెచ్చికొనుట దుర్ఘటముగ నున్నదని చమత్కారముగఁ బలుకుచుందురు. తనచేత నీళ్ళు పోయించుకొనువారు నెలకొక్కఁనాడు రెండుపూటలఁ దనకు భోజనము పెట్టవలసినదని గంగాధరుడు నియమ మేర్పఱచి యట్లొప్పుకొన్నవారికె నీళ్ళు పోయుచుఁ దనతిండికీ దడవుకొన నక్కఱలేకుండ హాయిగఁ గాలక్షేపము సేయు చుండెను. ఎవరిపంచనైన సోలెడు బియ్యము కాచుకొని దల్లిందిను మనక ప్రత్యేకముగ నొక చిన్నయిల్లు గంగాధరుఁ డేల బాడుగకు పుచ్చుకొనవలయు నని మీకు సందేహము తోఁచవచ్చును. అందుకు ముఖ్యకారణ మిది. తనపాలిటి కల్పవృక్షమై కామధేనువై చింతామణియై ఈ కన్న తల్లివలె తన్ను చిన్ననాఁట నుండియు గాపాడుచుండిన తరవాణి కుండను బ్రతిష్టించుటకుఁ వీలున్నను దనగుట్టు దాగదనియు నెఱిగి యతఁడు ప్రత్యేకముగ నిల్లు పుచ్చుకొనియెను. నెలకు ముప్పదిరూపాయిలు సంపాదించుచున్నాఁడు గనుక గంగాధరుఁడు కావలసినంతధనము కూడబెట్టునని మీలో ననేకులు