పుట:Ganapati (novel).pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

గ ణ ప తి

చుండెను. అది చీకటిరాత్రి. బండి పొలములోనుండి వెళ్లుచు నొకచో బోల్తపడెను. అదివరకు బండిలో బండుకొని నిద్రపోవుచున్న గణపతి బండి బోల్తపడినప్పు డెగిరి దూరముగాఁ బడెను. కునికిపాట్లు పడుచున్న మహాదేవశాస్త్రి మఱియొక వైపున గూలఁబడియెను. శాస్త్రిగారికి జేయి మడతబడి నొప్పిపట్టెను. బండివాఁడు గుమ్మడికాయవలె నేలఁబడ వాని చట్ట విఱిగెను. 'చట్టవిఱిగినది, బాబోయి!' యని వాడేడ్వజొచ్చెను. 'నాచేయి విఱిగినదిరా!' యని శాస్త్రి బెంగగొని గణపతీ ! గణపతీ! యని పదిసారులు పిలిచెను. అతఁడు పలుకలేదు. ఎద్దులు త్రొక్కిచంపినవో, బండి చక్రముక్రిందఁ బడి చచ్చెనో యని శాస్త్రి "భగవంతుడా ! యీ ప్రయాణ మెందుకు దెచ్చిపెట్టితివి ! పాప మీ కుఱ్ఱవాని జంపుటకా" యని ఖేదపడుచుండ నంతలో నెవరో మార్గస్తులు చిన్నలాంతరు పుచ్చుకొని యాదారినె వెళ్ళుచుండిరి. మహాదేవశాస్త్రి దూరమునం బోవుచున్న యా బాటసారులను గేకవైచి పిలిచెను. వారా కేక విని రాగా శాస్త్రి వారితో "మా బండి బోల్తా పడినది. నిద్రించుచున్న పిల్లవాఁ డెక్కడనో బడిపోయిఁనాడు. చచ్చిపోయినాడేమో యని భయపడుచున్నాము. కొంచెము వెదకండి, నాయనా!" యని చెప్పెను. వారు నలు దెసలు కలయం గనుంగొనఁగా గణపతి యొకచోఁ బడియుండెను. 'ఆ పిల్లవాఁడు స్మారకము