పుట:Ganapati (novel).pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

గ ణ ప తి

పడుచునే చుట్టకాల్చును. ఒకనాఁడు కునికిపాట్లలో నోటనున్న పొగచుట్ట కట్టుకొన్న బట్టపైఁ బడి, బట్ట కాలజొచ్చెను. పంతులుగారు బ్రతికియుండగానే శరీరము దగ్ధమగు నను భయమున, బాలురు కళవళపాటు నొంది "పంతులుగారు! బట్ట కాలుచున్న" దని కేకలు వైచి మేలు కొలిపిరి. ఆ కేకలు విని గణపతి మేల్కొని చేతులతో నలిపి బట్టయార్పి లేచి బెత్తము పుచ్చుకొని "పాడుముండా కొడుకులారా! బట్టంటుకోగానే కాలి చచ్చిపోదు ననుకున్నారా యేమిటి? మెల్లగా లేపలేక పోయినారా? అంతంత కేక లెందుకు? నిక్షేపమంటి నిద్ర చెడగొట్టినారు, వెధవ" లని వరుసగా నొక్కొక్కరినె వీపు బ్రద్దలు కొట్టెను. మఱియొకనా డా విధముగానే గణపతి నోటిచుట్ట కునికిపాట్లలో నుత్తరీయముపైఁడి నది కాలఁజొచ్చెను. లేపిన పక్షమున పంతులుగారు చావగొట్టుదు రని పిల్ల లూరకుండిరి. వీథిని వెళ్ళువా రెవరో యది చూచి గణపతిని మేలుకొలిపిరి. అతఁడు మెలఁకువ దెచ్చుకోని బాలకులఁ జూచి 'యోరి దరిద్రగొట్టు వెధవలారా! నేను కాలి చచ్చిపోతే సుఖముగ నుండవలె ననుకొన్నారా? ఇంతంత దుర్బుద్దులా మీ' కని బెత్తము విఱుగువరకు తాషాలు వాయించినట్లు వీపులమీఁద వాయించెను. ఒకనాడు లెక్కలు చెప్పుదును రమ్మని బాలకులం దనచుట్టుఁ గూర్చుండఁబెట్టుకొని, యంతలో గన్నులు మూఁతపడ కునుకుచు, "ముప్పది రూపాయల పందొమ్మిదణాల యిరువది పైసలు,