పుట:Ganapati (novel).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనవి

మిత్రులు శ్రీ వెలగల వీర్రెడ్డిగారు దేశభక్తి, భాషానురక్తి గల వారు, 1962 లో తమకున్న భాషాసేవ గావించు ఉద్దేశ్య మున్నదనిన్నీ, అందులోనూ అభ్యుదయ భావవ్యాప్తి గావించుటకై గ్రంథమండలిని నడుపుటకు తమకు చేయూతనిమ్మనీ అడిగినప్పుడు వారితో మాకుగల చిర పరిచయంవల్లనే అందు కంగీకరించాను. కాని యీఉద్దేశ్యం యేడాది వరకు కార్యరూపం ధరించనేలేదు.

1963 లో వారు స్ధాపించబోవు ప్రచురణ సంస్ధకు గౌరవసంపాదకులుగా నన్నుండ మని కోరుటయేగాక నేను పాతికేండ్లుగా సేకరిస్తూ వచ్చిన సూక్తులను ప్రచురణకై తమ గ్రంథమండలిలో ప్రథమ కుసుమముగా చేసెదమనిన్నీ, తమకు ఆ అవకాశము నిమ్మనీ కోరిరి. ఆ సూక్తిముక్తావళి గా వెలువడుటయు, సంవత్సరము న్నరలోపే ప్రతులైపోయి, పునర్ముద్రణ గావించుటయు జరిగినది.

దాని తరువాత కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారి గ్రంథములను వరుసగా ముద్రించ బూనికొని, అందముగా, నిర్దుష్టముగా ప్రచురించ నారంభించితిమి. గతమున ప్రచురించిన 11 పుస్తకములు గాక యిప్పుడీ సంవత్సరము 'గణపతి' 1, 2 భాగములను కలిపి ఒకే బైండు, లైబ్రరీ ఎడిషనుగా వెలువర్చితిమి. త్వరలోనే మరిన్ని కూడ వెలువడ గలవు.

భాషకు పుష్టిని కూర్చగల మహామహుల రచనలనే ప్రచురించ బూనుకొని యన్ని "కాలచక్రం ప్రచురణలు" ప్రజలయు, భాషాభిమానులయు సహాయ సహకారములు పొందగలదని ఆశించుచు సెలవు దీసి కొందును.

10-3-1966,
రాజమండ్రి

మహీధర జగన్మోహనరావు,
గౌరవసంపాదకుడు.