1925 నవంబరులో నాయన బందరులో సనాతన ధర్మ సభయందు సంస్కరణముల యావశ్యకతను గూర్చి ప్రబోధించి అటనుండి మంగళగిరికి పోయి ఆ నృసింహక్షేత్రమును ఇంద్ర క్షేత్రముగా గుర్తించెను.
1926లో వాసిష్ఠుడు తిరువణ్ణామలైకి వచ్చి "పూర్ణ" అను కల్పిత కథను నవలగా సంస్కృతమున ఆరంభించెను. ప్రతి సాయంకాలము రచించినంతవఱకు ఆ కథను నాయనకోవెల యందు వినిపించుచుండెను. 1926 ఏప్రిలులో దైవరాతుడు, వాసిష్ఠుని గ్రంథముల ప్రకాశనము కొఱకు శిరసి అను గ్రామమున ఒక ముద్రణాలయమును కొని "నందినీ" ముద్రణాలయ మను పేరుతో నాయనకు అర్పించెను. అంతకుముందే అతడు 1925లో గోకర్ణములో ఆశ్రమమును స్థాపించి దానియందు గురుస్థానమును స్వీకరింపవలసినదని నాయనను ఆహ్వానించి యుండెను. ఆ సమయమునకు అమ్మకు పాండురోగము వలన ఆరోగ్యము క్షీణించుచుండుటచే నాయన అచ్చటికి పోలేకపోయెను. 18-7-1926 నుండి విశాలాక్షమ్మ మంచము పట్టి 26 వ తేది పరమపదించెను. అప్పుడు నాయన సన్న్యసించునని అనేకులు తలంచిరి. కాని ఆయన తుది వఱకు యజ్ఞోపవీతమును వీడలేదు.
గణపతిమునియొక్క సంస్కారభావములు రమణాశ్రమ లక్ష్యమునకు విరుద్దములని, ఆయన శిష్యులకు శక్తి సంపాదనమే ధ్యేయమని, మహర్షికి నాయనకు లక్ష్యములలో భేదమున్నదని కొందఱు ప్రచారము చేయ జొచ్చిరి. అందులకు గణపతి