పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేకుండునట్లుచేసి గృహములన్నియు మంత్ర స్పందనములచే ప్రతిధ్వనించు నట్లొనర్చుట నాల్గవది. ఈ నాలుగింటి నేకకాలమందే సాధించవలెను. అప్పుడు మనదేశము, మనజాతి కూడ సర్వారిష్టములనుండి విముక్తిబొందుట తథ్యము..."[1]

రంగయ్యనాయునితో మాటాడుచు కావ్యకంఠుడు ఒకనాడు ఇట్లు ఉద్ఘాటించెను. "రాతియుగము, కంచుయుగము అను విభాగము లూహాగానములు. బృహత్తరమైన మనదేశమందిప్పటికిని వెండిబంగారములతో పాటు ఇతర లోహములను రాళ్లను పాత్రలుగా వాడుక చేయుచున్నాము. మట్టితో చేయబడిన కుండలను వాడు చుంటిమి. ఏయే కార్యముల కేవేవి శ్రేష్ఠమో యుగయుగముల క్రిందటనే మనము తెలిసికొంటిమి. తెలియనివారును మనమధ్య నున్నారు. అట్టివారిని జూచి వారు మనతొలినాగరికతకు చెందిన వారనుట సమంజసము కాదు. .........నాగరికత యనునది దీనిని బట్టి మనము వాడుకచేయు పాత్రలపై ఆధారపడ దని విశదమగును. ...... ఇట్టి ధోరణి చొప్పున మన మతమునకు గూడ చరిత్ర వ్రాసినవా రున్నారు. వీరి దృష్టిలో వేదకాలమందాచార్యులు పశువులమందల నడవులందు మేపుకొనుచు పశు సంపదకొఱకే ప్రార్థించువా రనియు, కొండలను నదులను దైవములుగా భావించి నిర్గుణదేవతాతత్త్వమును గ్రహింపలేకుండి రనియు దోచినందున వేదకాలమునందు మతభావములు సంకుచితములై, క్రమాభివృద్దిచే విశాలము లగుచు, జైన - బౌద్ద - మహమ్మదీయ - క్రైస్తవ ప్రవక్తల ప్రబోదములను గ్రహించి పూర్ణతచెంది నట్లెంచువారు.

  1. * నాయన - పుటలు 173, 174