తందులం సుబ్రహ్మణ్య అయ్యరును గైకొని వచ్చి కావ్యకంఠుని దర్శించెను. ఆయన వేంకటరాయశాస్త్రిగారి సందేహములను తీర్చి ఆశువుగా శ్లోకములను చెప్పి వారి ప్రశంసకు పాత్రుడయ్యెను. రంగయ్య నాయుడు అను తెలుగు పండితుడు ఒక పురాతన వైద్య గ్రంథము తీసికొని వచ్చెను. దాని నొక్క గంటలో పరిశీలించి రంగయ్య సంశయముల కన్నింటికి ఆయన సమాధానములు చెప్పెను. పిమ్మట ఆయన అన్నామలైకి మరలి వచ్చెను.
నరసింహశాస్త్రి నేత్రరోగచికిత్స కొఱకు చెన్నపట్టణమునకు వచ్చి యటనుండి తిరువణ్ణామలైచేరి బ్రాహ్మణస్వామిని దర్శించెను. పాఠశాలలకు సెలవులిచ్చినంతనే గణపతిశాస్త్రి తండ్రిని గైకొని చెన్నపురమునకు వచ్చి ఆయనను కలువఱాయికి పంపి తాను రామస్వామి యింటికి పోయెను. అక్కడ పెక్కుమంది ఆయనను దర్శించుటకు వచ్చుచుండిరి. ఆ యిల్లు చాలక ఆయన బసను దొరస్వామి అను విద్యార్థి ఇంటికి మార్చెను.
ఒకనాడు తోడి విద్యార్థులతోకూడి దొరస్వామి ఆయనతో మాటలాడుచు షేక్స్పియర్ రచించిన "మాక్బెత్" నాటక కథను చెప్పెను. కావ్యకంఠుడు వెంటనే "డంకస్ నామమహీపతిస్సమ భవత్" అని ఆరంభించి ఆ కథను కావ్యముగా అనర్గళముగా చెప్పెను. పిమ్మట ఒక విద్యార్థి ఆంగ్ల వార్తాపత్రికలోని కొన్ని పంక్తులను చదివి వినిపించగా కావ్యకంఠుడు ఆ పంక్తుల నన్నింటిని మరల చదువుటయేకాక తుదినుండి మొదటికి కూడ చదివి వారిని ఆశ్చర్యపరవశుల గావించెను. దొరస్వామి భక్తి