పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విష్ణుపరముగా వివరించి బ్రాహ్మణస్వామి పరముగాకూడ వ్యాఖ్యానించెను. బ్రాహ్మణస్వామి చిరునవ్వుతో గణపతిని అభినందించెను. అయినను ఆ స్వామిని ఆశ్రయింపవలెనను తలంపు అప్పుడు ఆయనకు కలుగలేదు. వారు తిరిగి వచ్చిరి.

అప్పటికి బ్రాహ్మణస్వామి వయస్సు సుమారు 22 ఏండ్లు. ఆయనకు కాషాయము దండ కమండలములు లేవు. కాబట్టి ఆయన సన్యాసికాడు. బ్రహ్మచారి యని తలంచుటకు యజ్ఞోపవీతము లేదు. తత్త్వజ్ఞుడు అనాచారముతో నుండునా? లోకహితమునకు అవతరించిన స్థూలశిరస్సు అయినచో దుర్గా మందిరయోగివలె తన్ను పలుకరింపడా? అని పెక్కు సందేహములతో కావ్యకంఠుడు ఆ స్వామి విషయమున అప్పుడు శ్రద్ధ వహింపలేదు. ఆయన తిరిగి వచ్చి హరస్తుతివలన హరుని దర్శనముకాని, సంపూర్ణమైన యనుగ్రహముకాని కలుగలేదని నిర్వేదముతో అ గ్రంథము చింపివేసెను. కల్పట్ రామస్వామి అను శిష్యుడు దీనికొక ప్రతిని వ్రాసికొనియుండెను. కాని ఆయన అకస్మికముగా మరణించెను. ఆ ప్రతి దొరకలేదు.