పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బి. ఎస్. రామారావు, ఆయనకు మిత్రుడు ఆర్. సంజీవరావు అధిక ప్రజ్ఞను చూపి నాయనకు ప్రేమాస్పదులైరి. వీరే నాయన కీర్తిని కలకత్తాలో నాలుగు మూలలకు ప్రసరింప జేసిరి. సుమారు ఒక మాసము ఇట్లు గడచెను. ఈ ఉపన్యాసములవలన అక్కడ పెద్ద సంచలనము కలిగెను. నాయన మంత్రదీక్షలను గైకొనిన వారికి నియమావళిని ఏర్పఱచి ప్రత్యేక బోదనలను గావించెను. భక్తులు నాయన కొఱకు ఒక అద్దె యింటిని ఏర్పఱచిరి. లక్ష్మికాంతము నాయనకు తగినట్లుగా ఆహారపానీయాదులను సమకూర్చుచుండెను. లక్ష్మికాంతమునకు ఆయన భార్య సూరమ్మకు రాత్రులందు నాయన ప్రత్యేకముగా బోధించెడివాడు. 1935 ఆగష్టులో నాయన ఆమెకు గాయత్రీ మంత్రమును ఉపదేశించెను. నాయన దివ్య శరీరము ఒకనాడు లక్ష్మికాంతమును ఆవహించెను. అప్పుడు నాయన ఇట్లనెను. "ఇది నా దివ్య శరీరముయొక్క యనుగ్రహ చేష్ట. ఇది సూరమ్మను అనుగ్రహించుటకు నన్ను ప్రేరేపించిన పిదప, నాకు తెలియకుండ నిన్ను అనుగ్రహించెను. దీని యుద్భవము నాకు కపాలము భిన్నమైనప్పుడే తెలిసినను ద్యానమందున్నప్పుడు మాత్రము నాకు దాని మహిమ గోచరించుచు, మిగిలిన వేళలందు దాని వ్యాపార సంచారములు తెలియబడుట లేదు. అది తెలిసి నప్పుడు నా తపస్సు పూర్ణ సిద్దిని బొందినట్లుగును. అందుకొఱకు నే నిరువది దినములు రేణుకాదేవి యాజ్ఞాపించిన దీక్ష బూనవలెను. కాని దీనికి పూర్వము గోచరించవలసిన సిద్ది యభివ్యక్తము కానందున నా తపస్సునందు ఆ దీక్షకు దగిన పాకము రాలేదని జాప్య మొనర్చుచుంటిని."[1]

  1. * నాయన - పుట 694