Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14-6-1936 తేది పార్సీ స్త్రీలు కొందఱు శ్రీఅరవిందుని యోగమును గూర్చి, వేద ఋషుల యనుభూతుల కంటె అధికమైన దానిని అన్వేషించితినని ఆయన చెప్పుటను గూర్చి, మఱియును ఉపనిషత్తులలోని ఋషులకు కలిగిన సాక్షాత్కారమును పొంది యుండుట తనకు శిష్యులుగా కాగోరిన వారికి అర్హతయని శ్రీమాత అభిప్రాయపడుటను గూర్చి ప్రస్తావించి వీనిపై మహర్షి యభిప్రాయ మేమని యడిగిరి.

"శ్రీఅరవిందుడు సమగ్రమైన శరణాగతి చేయుడని ఉపదేశించు చున్నాడు. మొదట ఆ పనిని చేసి ఫలమును నిరీక్షింతము. తరువాత అవశ్యకమైనచో ఇతర విషయములను గూర్చి చర్చింతము. ఇప్పుడు కాదు" అని మహర్షి శరణాగతిని గూర్చి చెప్పెను.

వారు మరల ఇట్లు ప్రశ్నించిరి, "దివ్య చైతన్యమును క్రిందికి తెచ్చుటను గూర్చి ఏమందురు?"

మహర్షి:- అది ఇప్పుడు మన హృదయమునందు లేనట్లా? "ఓ అర్జునా; నేను హృదయాకాశము నందు వున్నాను" అని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. "సూర్యుని యందు ఎవడు వున్నాడో ఆ పురుషుడు ఈ మానవుని యందు కూడ వున్నాడు" అని ఉపనిషత్తులోని మంత్రము చెప్పుచున్నది. "భగవంతుని రాజ్యము లోపల నున్నది" అని బైబిలు చెప్పుచున్నది. ఈ విధముగా భగవంతుడు లోపలనే యున్నాడను విషయమును అందఱును అంగీకరించు చున్నారు. క్రిందికి తేవలసినది ఏది? ఎక్కడ నుండి? ఎవడు దేని కొఱకు తేవలె?