పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

కైఫీయతు లందలి భాష

కైఫీయతు అను హిందీపదమునకు వాఙ్మూలము లేక కవిలె గ్రంథము అని అర్థము. తెలుగున నిట్టి కైఫీయతులు పెక్కు కానవచ్చుచున్నవి. వాని నన్నిటిని మెకంజీ మున్నగువారు సేకరించి యున్నారు. సాధారణముగా నొక్కొక్కగ్రామమున కొక్కొక్కకైఫీయతు వ్రాయబడియున్నది. అందా గ్రామమునకు సంబంధించిన వివరములెన్నో యొసంగబడును. ఆ గ్రామమున కాపేరు వచ్చుటకు కారణమేమి, ఆ గ్రామము ఏయే కాలములం దెవరెవరి పాలనమున నుండెను, అం దేయే దేవాలయము లున్నవి, అందలి భూమి వివరములు మున్నగునవందు ముఖ్యమైనవి. ఈ కైఫీయతులు గ్రామమునందలి కరణములచే గాని గుమస్తాలచే గాని వ్రాయబడుచుండెను. ఇందలి భాష ఆయాకాలములయందు వ్యవహారము నందున్నట్టిదే. కొన్ని కైఫీయతులలో శాసనములందు వలె వంశక్రమములను వర్ణించు సంస్కృతశ్లోకములును తెలుగుపద్యములును కానవచ్చును. కొన్నిటిలో నాయాపద్యాదుల తాత్పర్యము లొసంగబడినవి. కైఫియతులను బట్టి ఆయాకాలము లందలి చరిత్రాంశములేకాక భాషాపరిస్థితులను కూడ తెలిసికొనుట కవకాశమున్నది. అందుకు వానిని వ్రాసినవారు తమనాడు వ్యవహారముననున్న భాష నందు వాడుటయే కారణము.

ధ్వనులు

ఈ కైఫీయతులతో ఎచ్చటను శకటరేఫము వాడబడి యుండలేదు. అర్ధబిందువు లసలే లేవు. బిందువు తరువాత వచ్చు హల్లులన్నియు ద్విత్వయుక్తములుగా వ్రాయబడియున్నవి. ఉదాహరణము: జమాయించ్చుకొని; వ్రాయించ్చుకొని; ఉండబడ్డషువంటి; పంట్టు; కాలమంద్దు; కళావంత్తినులకు మొదలైనవి. ద్విత్వములైన న, మ కారములకు ముందు బిందు వుండవలసిన యవసరము లేకపోయినను బిందువులు వ్రాయబడినవి. ఉదా : సొంమ్ము; వుంన్నది; కంన్నియను, గోత్రులుంన్ను. ఇట్లే కొన్నిచోట్ల బ్రాహ్మలనుచోట అవసరము లేక పోయినను బ్రా తరువాత పూర్ణానుస్వారము వ్రాయబడినది. బ్రాంహ్మలు సంయుక్తాక్షరమున రేఫము పూర్వాంగమైనప్పుడు పెక్కుచోట్ల వలపలిగిలక వాడబడినది. కొన్నిచోట్ల సంయుక్తాక్షరమున రెండవ భాగమైన హల్లునకు ద్విత్వము వ్రాయబడింది. ఉదా:- జర్గ్గడంలేదు; వార్ల్లకు; అంగార్క్క; అర్చ్చన; పునః, ప్రాయశః అనుచోట్ల విసర్గమునకు బదులు హకారము వ్రాయబడినది. ప్రాయశహ; పునహ. వ్యాకరణము ననుసరించి వువూవొవోలతో నారంభించు పదములు తెలుగులో లేవు. కాని ఈ కైఫీయతుల యందు పెక్కుచోట్ల ఉండు ధాతువు రూపములన్నియు వకారాదులుగానే వ్రాయబడినవి. ఒకటి శబ్దము వకటి అని వకారాదిగా వ్రాయబడినది. వొకానొక అను ప్రయోగము కూడ నున్నది. ఎల్లప్ప అను పదము యకారాదిగా కన్పించుచున్నది; యల్లప్ప. ఓరుగల్లు వోరుగల్లని వ్రాయబడినది.