పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

గ్రామ కైఫీయత్తులు

మరిని అగును. కైఫీయతులందు మరిన్నీ, అను రూపము కానవచ్చుచున్నది. చాతనుంన్ను, గోత్రులుంన్ను, అనునవి మఱికొన్ని ఉదాహరణములు. నిండ, కూడ, చాల మున్నగు పదములు నిండా, కూడా, చాలా అని దీర్ఘాంతములుగా కనబడుచున్నవి. వాని తరువాత నున్న ద్రుతము లోపించుటచే తత్పరిహారముగా, దీర్ఘము వచ్చినది. పేరు అను పద మిందు ఔపవిభక్తికముగా వాడబడుటచే పేరట, అను రూపము ప్రయోగింపబడినది. కాని టి, తి, వర్ణములు పరమగునవుడు ఉత్వమునకు ఇత్వమగునను సూత్రము ననుసరించి రులోని ఉకారము ఇకారముగా మాఱవలయును. పేరిట అనునది సరియైన రూపము. దేవుడు అనుపదము, దేముడు అని మకారమధ్యమముగా వాడబడినది. దేవుడు అను శబ్దమునకు నిజమునకు బహువచనాంత ముండదు అది నిత్త్యెకవచనాంతము కైఫీయతులలో దేముడ్లకు అను బహువచనరూపాంతము కానవచ్చుచున్నది. తోడ అను విభక్తిప్రత్యయమునకు, సమాసమున అది లోపింపనపుడు ఇత్వము వచ్చును, అనగా తోడి అను రూపమేర్పడును. కాని కైఫీయతులలో తోటి ఆను రూపము కానవచ్చుచున్నది. బ్రాహ్మణుడు అను శబ్దమునకు బ్రాహ్మణులు అనునది బహువచనరూపము. బ్రాహ్మడు, బ్రాహ్మలు అనురూపములు వాడుకలో కానవచ్చును. కైఫీయతులందు కూడ నారూపము పెక్కుసార్లు వాడబడినది. కొన్నిచోట్ల "బ్రా" తరువాత పూర్ణబిందువు కూడ కనబడుచున్నది. పర్యంతము అనుమాట “పరియంతరము” అని వాడబడినది. రుద్ర+అంశ = రుద్రాంశ అగును. కైఫీయతులం దొకచో రుద్రహంశ అని వాడబడినది. కళావంతుడు అను పదమునకు కళావతి అనునది స్త్రీలింగరూపము. కైఫీయతులలో నొక చోట కళావంతినులు అను పదము వాడబడినది. తదాది యనగా అది మొదలు అని అర్థము కై ఫీయతులలో కొన్నిచోట్ల తదాది మొదలు కొని అను ప్రయోగమున్నది. వ్యాకరణము ప్రకారము దుష్టములయ్యు వ్యవహారసిద్ధములై న యిట్టి ప్రయోగములు కైఫీయతులలో పెక్కు కనిపించును. ఒద్ద అనునది పలుచోట్ల వద్ద అనియే వాడబడినది.

విభక్తిప్రత్యయములు

"వలన” అను పంచమీవిభక్తిప్రత్యయము కైఫీయతులలో చాలాచోట్ల వల్ల అను రూపము తోనే కనపడుచున్నది. అల్లసాని పెద్దన మనుచరిత్రమున, ఈ చలిమల వల్ల నుల్లసిలు, చల్లతనంబున గాక యుండినన్" అని వల్ల ప్రత్యయమునే వాడియుండెను. ఉండి అనునది సాధారణముగా, వాడుకలో "నుండి" అను రూపముతో కానవచ్చును. చిన్నయ సూరి ధనము నుంచి, వనము నుంచి అని ఉంచి శబ్దానుప్రయోగముతో కొండఱు వ్యవహరింతురు. కాని అది సాధుకవి ప్రయోగారూఢము కాదని తెలిపియుండెను. కైఫీయతులలో నుంచియే పలుసార్లు వాడబడియున్నది. చేత అనుదానిలో చకారముమీద నున్నది ఏ అనునచ్చు కైఫీయతులలో కొన్ని చోట్ల చాతనుంన్ను అని అది ఆ కారముతో కానవచ్చుచున్నది. ప్రథమావిభక్తప్రత్యయమైన ము వర్ణకము కొన్ని చోట్ల స్వస్వరూపముతోనే వాడబడినను పెక్కుచోట్ల బిందురూపము దాల్చినది. ప్రభుత్వములో, అధికారం వచ్చి, రాజ్యభారం చేస్తూ, చెయ్యడం, పకరాతి శాసనం, సావనం, మున్నగు ప్రయోగము లిందుకు తార్కాణములు.