పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కైఫీయతులందలి భాష

25

వర్ణక్రమవిధానము

కైఫీయతులలో పెక్కువర్ణక్రమదోషములు గోచరించుచున్నవి. ఆ కాలము నందలి ప్రజల ఉచ్ఛారణము ననుసరించి ఆశబ్దము లట్టిరూపముతో వ్రాయబడి యుండును. ఉదా: శింహ్వాసనఁ ఇచ్చట దంత్యమైన సకారమునకు తాలవ్యమైన శవర్ణము వ్రాయుటయే కాక హకారమునకు క్రింద వకారముకూడ చేర్చబడినది. పెక్కుచోట్ల వర్గద్వితీయ చతుర్థాక్షరములకు బదులు ప్రథమతృతీయాక్షరములును, ప్రథమ తృతీయాక్షరములకు బదులు ద్వితీయ చతుర్థాక్షరములును వ్రాయబడినవి. ఉదాహరణ: స్వాస్త్యము, ఘట్టు (గట్టు). స వర్ణమునకు శవర్ణమును, ల వర్ణమునకు ళవర్ణమును వ్రాయబడినవి. ఉదా. స్తళము, చేశి, దేవుడు శబ్దము నందలి వకారమునకు బదులు మకారము వ్రాయబడినది. ఉదా: దేముడు. కొన్ని చోట్ల అవసరము లేకుండనే ద్విత్వములు వ్రాయబడినవి. ఉదా: నియ్యోగి; కాకతియ్య మొదలైనవి. సంబంధము అను శబ్దము సమ్మంధము అను రూపముతో వ్రాయబడినది. కొన్నిచోట్ల ఎకారము అకారరూపము నొందినది. ఉదా: చర్వుగట్టు (చె) చాతనున్న (చేతనున్ను) అయి, అవులకు తెలుగు శబ్దములలో ఐ ఔలు రూపాంతరములుగా కానవచ్చుచుండును. కైఫీయతులలో సంస్కృతశబ్దములలో కూడ నిట్టి మార్పు చేయబడినది. శివైక్యమను పదము శివయిక్యముగా వ్రాయబడినది. కదలలేక అను శబ్దము కదలల్యాక అనియు, నైవేద్యము, నెవేద్యమనియు, త్రవ్వి యనునది తొవ్వి అనియు వ్రాయబడినవి. ఇంకను వర్ణక్రమదోషము లందు విరివిగా కన్పించును.

అచ్చుల లోపము

ఆచ్ఛికములయందు పదమధ్యముల నలడరల ఉత్వమునకు లోపము బహుళముగా నగుననియు, లాతియచ్చునకు సహిత మొకానొకచో నుడి నడుమ లోపము కానబడుననియు, వ్యాకరణము చెప్పుచున్నది. కిన్క; అడ్గు; కూర్కు; ముల్కి; కల్కి; మున్నగున విందు కుదాహరణములు. ఇట్టి లోపములు ముఖ్యముగ ఉపోత్తమమైన యచ్చునకు లోపములు కైఫీయతులయందలి భాషలో వివిధములుగా కన్పట్టుచున్నవి. చెరువు అనుదానికి చెర్వు, జరుగు అనుటకు జర్గు అనురూపములున్నవి. పడమర అనునప్పుడు డకారము నందలి అకారము లోపించుటచే పడ్మర అను రూపమేర్పడినది. ఉపోత్తమ మనగా మూడుగాని అంతకు మించిగాని వర్ణములుగల శబ్ధములందు తుదివర్ణమునకు సమీపమునందున్న అక్షరము. "త్య్రాదీనాయంత్యముత్తమం.” దానికి సమీపమున నున్నది ఉపోత్తమము. కైఫీయతులందలి భాషలో కొన్నిచోట్ల తుది అచ్చులోపించుటయు, కొన్నిచోట్ల ఉపోత్తమమైన అచ్చు లోపించుటయు కానవచ్చును. చేయు, అగు అను ధాతువులకు చేసిన, అయిన, అనునవి భూతకాలక్రియాజన్యవిశేషణములు. వీనిలో ఉపోత్తమమైన అచ్చునకు లోపము కలిగినచో చేశ్న, అయ్న అనురూపము లేర్పడవలయును కాని కైఫీయతులలో చివరి యచ్చులోపించి ఉపోత్తమమైన అచ్చట్లే నిల్చిపోవుచున్నది. అయి, చెశ్ని, గన్కు, అంద్ను, అనురూపము లిందుకు ఉదాహరణములు. లు, ల, నలు పరమగునపుడు మువర్ణమునకు లోపమును తత్పూర్వాచ్చునకు దీర్ఘమును అగుట వ్యాకరణసమ్మతము. దీనిని బట్టి దేశమునకు అనుటకు దేశా