పుట:Endaro Wikimedianlu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భవ్యమైన రికార్డు

వికీపీడియా ద్వారా తమ రచనాశక్తిని ప్రదర్శించినవారు చాలామందే ఉన్నారు. వారిలో భవ్య ఒకరు. రాయడంతో సరిపెట్టకుండా వికీలో తమ గళాన్ని కూడా వినిపించిన వ్యక్తి ఆమె. మొన్ననే, 2022 లోనే, వికీలోకి వచ్చింది భవ్య. తెవికీ లోకి రావడంతోనే విరివిగా రాయడం మొదలుపెట్టింది. అది క్రికెట్ 2023 కావచ్చు, విశాఖపట్నం ప్రాజెక్టు కావచ్చు - వికీప్రాజెక్టులలో భవ్య చురుగ్గా కృషి చేస్తుంది.

చాలామంది లాగానే భవ్యకు కూడా వికీమీడియనుగా తెలుగు వికీపీడియానే పుట్టినిల్లు. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టుగా ఆమె తెవికీకి విశిష్టత తెచ్చింది. తెవికీలో రాస్తూండగానే లింగా లిబ్రే సైటులో పనిచేసింది. ఆమె అందులో 76 వేల పదాలకు పైగా ఆడియో ఫైళ్ళు తయారు చేసింది. నేలబారుగా పడి ఉన్న తెలుగు భాషా పదాల గణాంకాలు ఛివ్వున తాచుపాములా లేచినై. తెలుగు విభాగం 4 వేల నుండి 90 వేల ఫైళ్ళకు దూకింది. ప్రపంచంలో 27 వ స్థానంలో ఉన్న తెలుగు అమాంతం 4వ స్థానానికి ఎగబాకింది. అంతే కాదు, లింగ్వా లిబ్రేలో మాట్లాడిన స్పీకర్లలో ప్రపంచంలోనే న్యూమరో యూనో, మా భవ్య.

వికీలో మహిళల భాగస్వామ్యం పెంపొందించేందుకు చొరవ తీసుకుని వికీ సహచరులతో కలిసి ఒక ప్రాజెక్టు చేపట్టి, దాని గురించి వివరించి ఫౌండేషను నుండి గ్రాంటు పొందింది.

రాబోయే కాలానికి కాబోయే తెవికీ నిర్వాహకురాలీమె.


ఎందరో వికీమీడియన్లు

81