ఈ పుట అచ్చుదిద్దబడ్డది
142
ద్విపదభాగవతము
లలమి దిక్కులనెల్ల నందంద వెదకి
కానక యెంతయుఁ గళవళంబంది
మానసంబుల దుఃఖమగ్నులై యుండ;880
కోరి కైలాటంబుఁ గూడుగా మెలఁగు
నూరివంద్యుఁడు బ్రహ్మసుతుఁడు నారదుఁడు
హరి సన్నధికి వచ్చి యనిరుద్ధువార్తఁ
గరతలామలకంబుగాఁ జెప్ప శౌరిఁ
విని వృష్టిభోజాంధవీరులతోడ
ఘనయోధరథవాజికరులతోడుతను
బలభద్రసాత్యకిప్రద్యుమ్నసాంబ
[1]జలసత్యకృతవర్మసారణులాది
ద్వాదశాక్షోహిణీ దళసంఖ్యతోడ
యాదవరత్నంబు హరి దండువెడలె.
దళములు నడువంగ ధారుణి వడఁకె!
జలధులు కలఁగెనాశాచక్రమగలె!
హరియును నిట్లు నిత్యప్రయాణముల
నరుదెంచి రజతాద్రి యత్తీరభూమి
స్థాణునిచే రక్షితంబై వెలుంగు
శోణితపురము ముచ్చుటు విడియించి
యుపవనంబులు రాల్చియూళ్ళను గాల్చి
చపలత బహుజలాశయములఁ జెఱచి
పెరయీఁగ నందంద పేర్చిన పగిది
పురికోటలగ్గలద్భుతముగాఁ బట్టి890
- ↑ “జలసత్య” అర్థము విచార్యము. పేరై యుండు నేమో?