Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ మద్వేదాంత దేశికులు

తిరునక్షత్ర తనియన్:-
    కన్యాశ్రవణ సంభూతం ఘంటాంశం వేంకటేశితు:
    శ్రీ మద్వేంకట వాధార్యం వన్దేవేదాన్త దేశికమ్||
నిత్య తనియన్:-
    శ్రీమాన్ వేంకట వాధార్యం కవితార్కిక కేసరీ
    వేదాన్తా చార్య వర్యోమే సన్నిధత్తాం సదాహృది||

శ్రీమద్వేదాన్త దేశికులు విభవనామ సంవత్సర కన్యామానసమున శ్రవణనక్షత్రమునందు కాంచీపురమందలి తూప్పిల్ అని వ్యవహరింపబడు "దీపప్రకాశర్" సన్నిధి ప్రాంతమున అనంతసూరి-తోతారంబ అను దంపతులకు కుమారులుగా నవతరించిరి. వీరు అవతరించిన దినము శ్రీవేంకటాచలపతి వర్ష తిరునక్షత్రమగుటచే వీరికి తల్లిదండ్రులు వేంకటనాథులని పేరుపెట్టిరి.

వీరి మేనమామ వాది హంసాంబుది అని బిరుదు వహించిన ఆత్రేయ రామానుజాచార్యుల వారు. వీరికే కిడాంబి అప్పుళ్లార్ అనిపేరు. వీరియొద్దనే వేదాంత దేశికులు సకలశాస్త్రములను ఇరువది సంవత్సరముల వయసునకే అభ్యసించిరి. ఈవిషయమునే "వింశత్యబ్దే విశ్రుత నానావిద విద్య:" అని స్వయముగా చెప్పియున్నారు. వీరు శ్రీనివాసుని ఘంటావతారమని పెద్దలు చెప్పుదురు. ఈ విషయము వీరి అవతార కాలమునందే వ్యవహారములో నుండినది. ఆవిషయమునే వీరు తమ సంకల్ప సూర్యోదయమను నాటకమున "ఉత్ప్రేక్ష్యతే బుదజనై రుపపత్తి భూమ్నా ఘంటా హరే స్సమజనిష్ట యదాత్మనేతి" అనిచెప్పినారు.

ఆత్రేయ రామానుజాచార్యుల వారికి ఆచార్యులు నడాదూరు అమ్మాళ్. వారవద్ద కాలక్షేమునకై పోవునపుడు అప్పుళ్ళార్ వేంకటనాథులను కూడా తీసికొనిపోయిరట. అమ్మాళ్ వేంకటనాథులను గూర్చి విచారించి

    "ప్రతిష్ఠాపిత వేదాంత: ప్రతిక్షిప్త బహిర్మత:
    భూయాస్త్రై విద్య మానస్త్వం భూరికల్యాణ భాజనమ్||

("వేదాంతార్దములను స్థాపించి దుర్వాదులను నశింపజేసి త్త్రైవిద్యమానుడనై శుభముల బడయుము") అని మంగళా శాసనము చేసిరట. ఆమంగళాశాసన బలమే వారిని కవితార్కిక సింహులను చేసినది.

వీరు తమ ఆచార్యుల వలన గరుడ మంత్రమునుపదేశము పొంది తిరువహీంద్రపురమున గరుడనదీ తీరమునగల ఔదాద్రి యందు ఆ గరుడమంత్రమును జపించి

236