Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నంజీయర్

(వేదాన్తి)

తిరునక్షత్ర తనియన్:-
   ఫాల్గునోత్తరఫల్గున్యాం జాతం వేదాన్తి సమ్మనిమ్‌|
   శ్రీ పరాశర భట్టార్య పాదరేఖామయం భజే||
నిత్య తనియన్:-
   నమో వేదాన్త వేద్యాయ జగన్మంగళ హేతువే|
   యస్య వాగమృతాసార పూరితం భువన త్రయమ్‌||

వీరు విజయనామ సంవత్సరమున మీన మాసము ఉత్తర ఫల్గునీ నక్షత్రమునందవతరించిరి. వీరు మొదట అద్వైత సంప్రదాయస్థులు. మాధవాచార్యులనిపేరు. "వేదాంతి" యను బిరుదముతో షడ్దర్శనములకు షడాసనంబిడి మతాంతర విద్వాంసులను జయించు చుండిరి.

వీరి ఖ్యాతిని వినిన శ్రీపరాశరభట్టరు శ్రీరంగపట్టణము వేంచేసి తొమ్మిది దినములు వీరితో వాదముచేసి జయము నిర్ణయము కాక పదియవ దినమున "తిరువెడుందాండక"మున గల రహస్యార్థముల నుపన్యసింపగా వేదాంతి సంభ్రమాశ్చర్యములతో భట్టరువారు శ్రీపాదముల నాశ్రయించెను. వారి వలన పంచసంస్కారములు పొంది భగవద్రామానుజ దర్శనము నందభిమానము గలవారైరి.

శ్రీభట్టరును శ్రీరంగమునకు వేంచేసి వేదాంతిని జయించిన విషయమును "తిరునెడున్దాణ్డక" దివ్య ప్రబంధ రహస్యార్థములను శ్రీరంగని సన్నిధిలో విన్నవించిరి. ఆమరునాటి నుండి అధ్యయనోత్సవ ప్రారంభము. తదాదిగా భట్టర్ విజయ సూచకముగా నేటికిని అధ్యయనోత్సవమునకు ముందు దివసమున శ్రీరంగములో తిరునెడున్దాణ్డక ఉత్సవము జరుగుచున్నది.

వీరి ఆచార్యాభిమానము పరమ విలక్షణమైనది. వీరు శ్రీపరాశర భట్టరు వారి సన్నిధిలో దివ్య ప్రబంధార్థములను సేవించి రస్యముగా ఉపన్యసించెడివారు.

తిరువాయిమొழி "తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్లాన్" అనుగ్రహించిన "ఆరాయిఱప్పడి" వ్యాఖ్యానము అతిసంగ్రహముగానుండుటచే భట్టర్ నియమనానుసారము వీరు "ఒన్బదినాయిరప్పడి" వ్యాఖ్యను అనుగ్రహించిరి.

భట్టర్ వారిచే "నమ్ముడైయ జీయర్" అని అభిమానింప బడుటచే వీరికి "నంజీయర్" అను తిరునామమేర్పడినది.

తిరునక్షత్రము: మీనము-ఉత్తర

226