సారంగ మహామునీ
తిరుప్పాణియాళ్వార్
తిరునక్షత్ర తనియన్:-
వృశ్చికే రోహిణీ జాతం శ్రీపాణం నిచుళాపురే|
శ్రీవత్సాంశం గాయకేంద్రం మునివాహన మాశ్రయే||
నిత్యతనియన్:-
శ్రీ లోకసారంగ మహామునీంద్ర స్కంధాధి రూడం కలయామి నిత్యమ్
కళంక హీనం కమనీయ భక్తం కవీశ్వరం గాయక సార్వభౌమమ్||
ఆపాదచూడ మనుభూయ హరిం శయానం,
మధ్యే కనేర దుహితుర్ము దితాస్తరాత్మా|
అదృష్టతాం నయనయో ర్విషయాప్తరాణాం
యోనిశ్చికాయ మననై మునివాహనాం తమ్||
వీరు శ్రీరంగమునకు సమీపమున గల ఉఱైయూర్ అను దివ్య దేశమున కలియుగాది 342 సంవత్సరమునకు సరియగు దుర్మతి నామ సం||ర వృశ్చిక మాస (కార్తీక) కృష్ణపక్ష విదియా బుధవారమున రోహిణీ నక్షత్రమున ఒక బ్రాహ్మణుని క్షేత్రమున(పొలమున)వ్రీహి సస్యమున శ్రీవత్సాంశమున అయోనిజులై అవతరించిరి. ఆ త్రోవను పోవుచున్న ఒక మాలదాసరి వీరిని చూచి సంతాన హీనుడగుటచే వారిని భగవత్ప్రసాదముగా భావించి తనగృహమునకు తీసికొని పోయి పెంచుచుండెను.
వీరును అంత్యవర్ణమున పెరుగుటచే తమ అవకర్షమును దలచి శ్రీరంగక్షేత్రమును చేరక దక్షిణ తీరమునందే యుండి ఏకతారను మీటుచు శ్రీరంగనాథుని స్తుతించుచు ఆనంద నిర్బరులై యుండిరి.
శ్రీరంగనాథులును వీరి భక్తి జ్ఞాన వైరాగ్యములకు సంతసించి వారిని తోడ్కొని రమ్మని శ్రీలోకపారంగ మహామునీంద్రులను పంపిరి. వారును ఆళ్వార్లను పరిపరివిధముల ప్రార్థించినను ఆళ్వార్లు తమ నైచ్యమును తలచి శ్రీరంగ ప్రవేశము చేయుటకు అంగీకరింపలేదు. అంతట లోకపారంగమునీంద్రులు శ్రీరంగనాథులపై "ఆన"పెట్టి ఆళ్వార్లను తమభుజములపై వేంచేపుచేసికొని వచ్చి శ్రీరంగనాథుని సేవింపజేసిరి. ఆళ్వార్లను శ్రీరంగనాథుని సేవించి ఆనంద నిర్భరులై "అమలనాది పిరాన్" అను దివ్యప్రబంధము ననుగ్రహించిరి. "అణియరంగన్ ఎన్నముదినై కణ్డకణ్గళ్ ముత్తొన్ఱినై క్కాణవే" శ్రీరంగనాథులను సేవించిన నా నేత్రములు ఇతర విషయములను జూడజాలవు అని శ్రీరంగనాథులలో నైక్యము చెందిరి. తిరునక్షత్రము:వృశ్చికమాసం, రోహిణి.
199