పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

శాస్త్రప్రశంస


మ.

ఖగవిఖ్యాతి శిలీముఖమ్ము దళముల్ గాంచె న్మధుశ్రేణికా
దిగుణోద్యత్సుమనస్కమై ఫలదమై దివ్యాగమోత్తంసమై
జగతిన్ మంజులతాశ్రయంబగు ధనుశ్సాస్త్రంబు రాణించు ని
మ్ముగ మందారమహీరుహ మ్మనఁగ నామోదమ్ము పుట్టించుచున్.

106


పంచ.

హరిం గుఱించి యంచి తోపహారమిచ్చి తెచ్చిరా
పురాణపూరుషుల్ ఋషుల్ తపోబలంబుడంబునం
ధరామరామరాభయప్రదంబు లస్త్రశస్త్రముల్
ధరాధరుల్ ధరించి సంచితప్రతాపులై రిలన్.

107


వ.

అనిన విని యర్జునుండు కుంభసంభవుం గనుంగొని మహాత్మా! యేమి
కతంబున హరిం బ్రార్థించి మహర్షులు ధనుశ్శాస్త్రంబు వడసిరి. అట్లు
పెద్దగాలంబు తపం బాచరించినం బ్రాప్తంబగు నిమ్మహాగమంబు
భూపాలకులశ్రేష్ఠులకు నొసంగుటకుఁ గారణం బేమి వినవలతు సవిస్త
రంబుగా నానతీవలయునని పలుకు పాండవమధ్యముం గనుంగొని కల
శభవుం డిట్లనియె.

108


శా.

వేదాచారవిదూరగుల్ దనుజు లుగ్వం దుర్విధిం బర్వఁగా
వేదాచారవిశారదుల్ మునులు నిర్వేదింప సర్వేశ్వరుం
డాదిన్ మంత్రములున్ బ్రయోగ ముపసంహారంబునుం గా ధను
ర్వేదం బిచ్చిన నమ్మహాత్ములు దయావిర్భూతచేతస్కులై.

109


క.

అపకారికి నుపకారికి
నపకారము ద్విజుల కహిత మగు నుపకారం
మ్ముపకారికి నపకార
మ్మపకారికిఁ జేయు టర్హ మగు నృపతులకున్.

110


వ.

అని తలంచి ధనురాగమంబు సాంగోపాంగంబుగా రూపలక్షణంబు
ల నుపలక్షితులగు నృపకుమారులకు నుపదేశించినం గృతార్థులై
జగదుపద్రవంబు వారింపుచు లోకప్రవర్ధనకరులనం బ్రవర్థిల్లుచుం
డుదు రట్లగుట రాజులకు ధనుర్విద్యాకౌశలం బావశ్యకంబు.

111