పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

రంగారాధనము


గీ.

పావనాకార సంశ్రితభయవిదూర
హరనిటలచక్షురుపగేహ హవ్యవాహ
విఘ్నము లడంప విలువిద్య విస్తరింప
వరదుఁడవు నీవు నీకును వందనంబు.

272


వ.

అని యగ్నిభట్టారకు నారాధించి తత్ప్రసాదంబునఁ గృతార్థుండై
యర్ఘ్యపాద్యాదిపోడశోపచారంబుల ధాత్రీదేవిం బూజించి కరం
బులు మొగిచి.

273


ఉ.

అమ్మ తపోనుభావనిధి వమ్మ సమస్తము దాల్చు పేటి వీ
వమ్మ జగంబుల మ్మనుతు వమ్మ రమాదులు నీదుసాటి రా
రమ్మ రథాంగపాణి సతి వమ్మ మనంబున నీకు మ్రొక్కినా
నమ్మ దయోదయాంబునిధి వమ్మ పదాహతి నోర్చు ధారుణీ.

274


వ.

అని ధరిత్రిం బ్రార్థించి శరశరాసనానయవంబుల నిష్టదేవతావాహ
నంబు గావించి.

275


సీ.

విరివిగా విరిసిన విరజాజిపువులతో
        నెఱిదీర నెఱయు గన్నెరులతోడఁ
జెంగావిరంగైన క్రొంగల్వవిరులతో
        సౌగంధ్య మెసగు గొజ్జఁగులతోడ,
ఘుమ్మన నెత్తావిఁ గ్రమ్ము గేదఁగులతో
        బరువంపుసిరుల తామరలతోడఁ,
బొలుపు సంపాదించు పున్నాగములతోడఁ
        బ్రియములౌ బొడ్డుమల్లియలతోడ,


గీ.

కలితమృగమదకర్పూరగంధసార
కుంకుమాగరుకర్పూరసాంకవాది
సురభిళాలేపములతోడ సొబగు మీఱ
శరశరాసనపూజలు సలుపవలయు.

276


వ.

ఇవ్విధంబునఁ బూజించి మఱియును.

277