పుట:Dashavathara-Charitramu.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

[1]అన్నదాతలమంచు యాయజూకులమంచు దొరలచే రూకలు దోఁచువారుఁ
గడుపుకక్కుఱితికిఁ గావికోకలు గట్టి యతులమంచును భిక్ష లడుగువారుఁ
దల్లిదండ్రులఁ జంపి ధన మెత్తుకొనిపోయి చెలఁగి తొత్తులపొత్తు గలయువారుఁ
గాసువీసములకై కలహించి యతిరోషవివశులై ప్రాణము ల్విడుచువారు


తే.

దూరపరదేశి నని పంచఁ జేరి రాత్రి
వేళ యిలు సొచ్చి ధనమెల్ల వెరఁజువారు
నవిరతంబును జూదంబు లాడువారు
నగుచుఁ జెడుదురు కలియుగాంత్యమున జనులు.

21


తే.

అవని నొక్కొకపుణ్యాతురాలు పతినిఁ, జంపకయె జారువెంబడి జరుగుఁ గాని
పిట్టపిడుగున మగనిఁ జంపింప కిల్లు, వెడల దిల్లాలు కలియుగవిలయవేళ.

22


తే.

ఎన్న నైదేండ్లనైన నాఱేండ్లనైన
బిడ్డలను గండ్రు కన్నెక ల్గొడ్డు వీఁగి
పదియు నొకయేఁటఁ బెద్దలుఁ బదియునాఱు
నేండ్లు పరమాయువగుఁ గలి హెచ్చుకతన.

23


వ.

అట్టి సమయంబున.

24


శా.

శ్రీమద్విష్ణుయశోభిధానమున రాజిల్లున్ మహీదేవసు
గ్రాముం డొక్కఁడు సర్వసంపదల విభ్రాజిష్ణువౌ శంబళ
గ్రామాభిఖ్యపురంబులో నతనిభార్యారత్న మబ్జాలయా
హైమగ్రావసుతాభయై తగు సుశీలాబ్జాక్షి శీలంబునన్.

25


సీ.

కలనైన మగవానిఁ దలయెత్తిచూడదు కలకలనవ్వుచుఁ జిలుకబోదు
కులటలఁ గూడదు తొలఁగనీయదు పైఁట మీఁగాళ్లపై కోక మెదలనీదు
విభునితోఁ జెప్పక వెడలదు వాఁకిలి పొరుగిండ్ల నిరుగిండ్లఁ బ్రొద్దు గడప
దధిపుఁడు బిల్చినట్లైన దిగ్గునవచ్చు మమత దేవోపచారములు సలుపుఁ


తే.

బ్రతిదినము నత్తమామల బత్తి సేయుఁ, దోడికోడండ్రఁ గనుసయిదోడుజాడఁ
బరిజనంబులఁ బోషించుఁ బ్రజలరీతి, సరసభాషణసాధ్వి యప్పరమసాధ్వి.

26


క.

ఆపుణ్యసాధ్వి కాత్మజుఁ, డై పుట్టును గల్కి యనఁగ నంభోనిధిక
న్యాపతి పంచగ్రహములు, దీపితముగ నుచ్చసంస్థితిం బొరయంగన్.

27


క.

లౌల్యప్రధానమై తగు, బాల్యము గ్రమియించి తరుణభావము దనరం
బాల్యము భూతల మిఁక నని, లౌల్యంబున గల్కి విజయలంపటుఁ డగుచున్.

28


సీ.

తళుకుబంగరుచెఱంగులయోర తలపాగ తలకుఁ జౌపంచ మిన్నలతురాయి
మొసలివాయొంటుల మిసిమికస్తురిబొట్టు నంగిపైఁ బొసఁగు వజ్రాంగిజోడు

  1. అగ్నులు ధరియించి