పుట:Dashavathara-Charitramu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్పలమారంద ముదశ్రువు న్మదకపోలద్వంద్వమై సర్వమై
చెలువయ్యె న్గృహలక్ష్మి సాత్త్వికముచే శ్రీవిష్ణుసంగంబునన్.

127


వ.

అని యిందిరారవిందనయనానందకరుం డగు నందకకరునిషందిరసౌందర్యంబు
నకు డెందంబున నానందించుచు శతానందనందను లగు సనకసనందనాదికర్మం
దిబృందారకులు ప్రజ్ఞావిజ్ఞానంబులం దాము తద్దయుఁ బెద్దలయ్యు నద్దేవదేవు
నకు ముద్దులమనుమలుగావునఁ జౌపంచప్రాయంబులవారలై కనుపట్టి దిగం
బరు లయ్యు నంబరమణిరమణీ ప్రభాడంబరవిడంబనామందేహంబు లగు
దేహంబులు ప్రకాశింప దండకమండలువులు గైకొనకుండియుం దమయతి
లోకప్రభావంబు భావంబున భావించి తత్రత్యదేవతాగణంబులు గావించు
సాష్టాంగసేవలకు నుచ్చరించు నారాయణోచ్ఛారణం బోంకారసూచకం
బుగా నభ్యంతరగృహంబున కరుగు సమయంబున.

128


క.

బాలురుగాన వివేకము, సాలదొ బిసబిసన నెందుఁ జనియెద రంచుం
గోలలు వైచిరి శతధృతి, బాలులముందఱను ద్వారపాలకు లలుకన్.

129


వ.

ఇవ్విధంబున.

130


క.

పోవలదని రోధించిన, దౌవారికజనముఁ గాంచి తాపసవరు లే
లా వారించెద రకట, శ్రీవల్లభుపాదసేవ సేయఁగఁ దగమే.

131


తే.

అనిన వేళ గాదు వనజాతనేత్రుండు, తరుణిఁ గూడి యంతిపురమునందు
నున్నవాఁ డటన్న నొక్కింత నవ్వుచు, సనకమౌని వెనుక సనక యనియె.

132


మ.

ఇనబింబంబున యోగిమానసములం దేప్రొద్దు శ్రీకాంతతో
వనజాక్షుండు వసించు మీ రెఱుఁగరే వారింపరా రెన్నఁడుం
గనుదమ్ము ల్వికసింపఁ గన్గొనుదు మర్కస్థాయి నాత్మస్థితున్
ఘనవిజ్ఞానవిలోకనంబునఁ గడుం గన్గొందు మిచ్ఛారతిన్.

133


క.

కనుటయుఁ గనఁదగు నదియును, గనుఁగొనువాఁ డాత్మ యయ్యెఁ గనుఁగొనవలదం
చును వారించెద రెవ్వరిఁ, గనుఁగొనఁగా రానిదేది కనుఁగొనుఁ డాత్మన్.

134


తే.

ఏల యజ్ఞాన మొదవె నీవేళ మీకు, నిర్వికారంబు పూర్ణంబు నిర్మలంబ
నైనపరమాత్మ కొకవికారానుభవము, గలుగఁజేసితి రేమనఁగలము మిమ్ము.

135


తే.

ఘట[1]మటోపాధి భిన్న మౌ గగన మట్లు, ప్రకృతిసంబంధమున భిన్నభంగిఁ దోఁచు
నాత్మ యింతియె కాని వేదాంతయుక్తి, నరసిచూచిన భేద మావంత లేదు.

136


తే.

ప్రకృతిభిన్నగుణంబులఁ బ్రభువుఁ బోలి, మమ్ము దౌవారికులఁ జేసి మనుపుచోటఁ
దదధికారంబు దప్పింపఁ దరముగా ద, టన్న నటువలె ననఁగరా దదియు వినుఁడు.

137
  1. పటోపాధి