పుట:Dashavathara-Charitramu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లుగ్రుఁడు మొదలుఁ బ్రత్యుత్థాన మొనరించి పూజింపఁగాఁ దగుపూజ్యతములు
నారదాదులకు డెందంబునఁ దోఁపని యర్థముల్ దెల్పు తత్త్వార్థవిదులు


తే.

సంతతాత్మానుభవసౌఖ్యజాయమాన, తృప్తితృప్తాంతరంగులై తిరుగుచుండ్రు
సకలజగముల సనకాదిశాంతినిధులు, వార లొకనాఁడు హరిఁ జూచువాంఛ యొదవ.

118


సీ.

ద్వారకాంచనరంభ లూరుకాండములుగాఁ గలితసోపానము ల్వళులుగాగఁ
గమలాకరస్ఫూర్తి గంభీరనాభిగా నారామరేఖ నూగారు గాఁగఁ
బదివన్నియలకోట పసిఁడియొడ్డణముగా సౌధశృంగము లురోజములు గాఁగ
భవనాగ్రకేతనపాళి పయ్యెద గాఁగఁ దొగలతోరణము భూయుగము గాఁగ


తే.

హంసకారావయుతపరిఖాంబుజంబు, లడుగులును ధూపధూమంబు లలకములుగ
ఠీవి సాక్షాత్కరించిన శ్రీవధూటిఁ, బోలి చెలువొందు వైకుంఠపురమునకును.

119


క.

చని యేలోకంబునఁ గాం, చనివైభవ మిందుఁ జూడ సమకూరె నటం
చని ప్రాపించి కరమ మె, చ్చనివా రన్యోన్యసూక్తిచాతురి మెఱయన్.

120


ఉ.

శ్రీవిభుఁ డాద్యుఁ డీశ్వరవిరించిముఖామరసేవ్యుఁ డంచు స
ద్భావమునన్ భజింపఁగల భక్తులు ముక్తశరీరులై ముదం
బావహిలంగ నీడ జలమాడక లింగశరీరముక్తి లే
దీవిరజానదీమహిమ మెన్న సమర్థులమే సనందనా.

121


ఉ.

మందసమీరచంచలసమంజసకంజపరాగపుంజ మెం
దెందు రజోగుణంబు వెలయింపఁ దదీయమరందలాలసేం
దిందిరము ల్దమోగుణముఁ దెల్పెడు నింతియకాని చూడఁగా
నిందురజస్తమోగుణము లెన్నఁడు లేవుగదా తపోధనా.

122


మ.

అరిషడ్వర్గము లేమి దుఃఖములపొం దావంతయున్ లేక శ్రీ
విరజానామతరంగిణీజలములో విధ్యుక్తి సుస్నాతులై
స్థిరభక్తిన్ సమయం బెఱింగి హరి సంసేవించుచుం దుష్టిచే
కుఱహర్షించు సలోకముక్తులఁ గనుంగొంటే జటీంద్రాగ్రణీ.

123


సీ.

మణీకిరీటంబులు మకరకుండలములు నాకర్ణధవళనేత్రాంబుజములుఁ
బావనవైజయంతీవనమాలికాకౌస్తుభకలితవక్షస్థలములు
శంఖచక్రగదాసిశార్ఙపంచాయుధదుర్వారబాహాచతుష్టయములు
ఘనకటీతటబద్ధకనకాంబరంబులు నాభిశోభితపాండునయనములును


తే.

విబుధపతినీలరుచిదివ్యవిగ్రహములు, దర్పకానంతసదృశసౌందర్యములును
గలిగి చెలువొందుచున్నారు కంటె వీరి, విష్ణుసారూప్యవంతుల విమలమతుల.

124