పుట:Dashavathara-Charitramu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

మించి నేనెంత దెలుప లజ్జింపవైతి, దక్షనందనవయ్యు సత్పదము దక్కి
చిత్తభవునకుఁ జిక్కి దుష్క్రియకుఁ జొక్కి, యింత చేసితి వేమందు నిందువదన.

96


ఉ.

కామము ధైర్యవారణనికామము దుర్దమదుష్క్రియాలతా
రామము సత్క్రియాధృతివిరామము క్రోధముఖాదిపంచక
క్షేమము నాస్తికత్వ మతిసీమము దుర్వ్యసనాబ్ధిరాట్సుధా
ధామము సర్వదుష్టగుణధామము దానిఁ బరిగ్రహింతురే.

97


సీ.

వదినె యంచు నొకింత వాత్సల్య ముంచక పౌలోమి ముందల బట్టువారు
న్యాయంబు గాదిది యని బృహస్పతి పల్క వికవిక నగి చెంప వ్రేయువారుఁ
బినతండ్రి యని తండ్రి గనమి జయంతుండు వచ్చినఁ జెఱసాల వైచువారు
హరిని నుతించు నటంచు నానావేదశాస్త్రము ల్ఖిలముగా సల్పువారు


తే.

నీదుగర్భంబునందు జన్మింతు రబల, సంజ రమియించినట్టిదోషంబువలన
రుద్రభృత్యులు భద్రానుభద్రు లనెడు, వారు గడపటఁ దెగుదురు శౌరిచేత.

98


క.

అన ముఖవర్ణవ్యత్యయ, మున మోదము ఖేద మగుట మునిపతి దెలియం
గనుఁగొని భయసంభ్రమములు, బెనఁగొనఁ దనమనములోన బిత్తరి యనియెన్.

99


తే.

విను మనోహర యొకరసావేశమునను, దను వెఱుంగమి నపు డట్టితలఁపు పుట్టె
నిపుడు విస్మయమయ్యెడు నెన్నికొనిన, దైవకృత్యంబు గాకేమి తప్పు గలదె.

100


మ.

ఘనశౌర్యంబున వైరివీరవరులన్ ఖండించి లోకంబు లె
ల్లను బాలింపఁగఁ జాలునిద్దఱుసుతు ల్మద్గర్భసంభూతు లై
నను జాలు న్గలుషాత్ములైన వెఱవం దర్వాత శ్రీభర్తచే
తనుమేను ల్ద్యజియింపఁ గల్గుట గరస్థంబౌఁ గదా మోక్షమున్.

101


తే.

ఐన సాధునింద కాలయు లగుటను, వగవవలయు వారివారి కైన
విష్ణుదేవుభక్తి విబుధానురక్తియుఁ, గలుగఁ గరుణ సేయు కాంత యనిన.

102


క.

వనితా పశ్చాత్తాపం, బునఁ గుందుట విష్ణుదేవుఁ బొగడుట నన్నుం
గని మని కొల్చుటవలన, న్నిను మెచ్చితి శుభము గల్గు నీ కిటమీఁదన్.

103


తే.

రమణి నీయగ్రసుతుఁడు హిరణ్యకశిపుఁ, డతనికి జనించుఁ బ్రహ్లాదుఁ డనుకృతార్థుఁ
డతనియుత్తమచారిత్ర మఖిలవిష్ణు, భక్తజనముఖ్యులకు మేలుబంతి యగును.

104


క.

శ్రీదయితపాదసేవా, హ్లాదుఁడు ప్రహ్లాదుఁ డలరు నతిపావనుఁడై
మోదమున నుండుఁ బొమ్మని, యాదితి నూరార్చియుండె నతఁడు యథేచ్ఛన్.

105


వ.

అంత.

106


తే.

దితికపోలతలంబులు తెల్లవాఱె, నదితి నెమ్మోము వెలవెలనయ్యెఁ దోఁడఁ
బంచికొనెనేమొ రుఛియు సాపత్యమునను, గాక సైరింపఁగలదె యేకడ సపత్ని.

107


క.

గర్భమున వృద్ధిఁబొందెడు, నర్భకులశరీరకాంతి యధికంబై యా