పుట:Dashavathara-Charitramu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

తనగంభీరతచేత నిర్జలతఁ జెందం జేసి వారాశి డాఁ
గినమైనాకునిఁ బైటవైవక జగధేయప్రదానంబు వా
హినుల న్నించె నటంచు సమ్ముదముతో నింపొందు శైలేంద్రనం
దన యిచ్చున్ దయఁ బద్మనాభఘను కృష్ణస్వామి కైశ్వర్యముల్.

6


మ.

తళుకుంబంగరుమేను వజ్రమయమౌ దంతంబు హస్తంబునం
దళుకున్ముత్తెపుమోదకంబు దగ శృంగారంబుగాఁ జేసి ని
చ్చలుఁ బూజించుటచేఁ బ్రసన్నుఁడయి నిష్ప్రత్యూహసంసిద్ధిచే
వెలయించు న్ధృతి నేకదంతుఁడు గృపావేశంబుతో నెప్పుడున్.

7


మ.

భవతేజంబునఁ బుట్టి రామభజనాపారీణుఁ డై పద్మసం
భవసామ్రాజ్యరమాధురంధరతకై భాసిల్లియు న్నిత్యస
త్యవిశేషస్థితి సద్విరోధివిషయధ్వాంతార్కబింబాకృతిన్
భువిలో మంతున కెక్కి నట్టి హనుమంతుం గొల్తు నిష్టాప్తికిన్.

8


మ.

ఘనశబ్దేభ ముదీర్ణవర్ణమణిప్రేంఖద్ధాటిఘోటంబు చం
కనదర్ధం బతిహృద్యపద్యభటసంఘాతంబు లోకైకరం
జనశృంగారవధూక మైనకవితాసామ్రాజ్య మేలంగ నే
ర్చినవిద్వత్కవిరాజరాజుల వచశ్శ్రీ నెంచి ప్రార్థించెదన్.

9


మ.

పదలాలిత్యము లేమి ఖంజులును శబ్దజ్ఞానవిజ్ఞానసం
పద లేమిన్ బధిరు ల్పదార్థములఁ గాన్పన్ లేమి జాత్యంధులు
న్మృదుత న్వేఁడిన నుత్తరం బొసఁగలేమి న్మూఁగలౌ వారి దు
ర్మద మేమాత్ర మదేల తాదృశకవిమన్యు ల్వివాదార్హులే.

10


సీ.

శ్లేషాదిపదములు చెలువు సూపఁగఁ బదవాక్యార్థదోషము ల్వర్జములుగ
విమలకైశిక్యాదివృత్తులు దనర వైదర్భ్యాదిరీతులు దళుకు నెఱప
సరసరత్యాదికస్థాయిభావములు శృంగారాదిరసములక్రమము మెఱయ
భావవిభావానుభావసాత్త్వికభావసంచారిభావము ల్మించుగులుక


తే.

విలసదుపమాద్యలంక్రియ ల్వింతఁ దెలుప, లలితముగఁ బాకములు సేయ లక్ష్యశయ్యఁ
గవిత రచియింపనేర్చు సత్కవికిఁ గాకఁ, గాకవుల కేది లోకవిఖ్యాతకీర్తి.

11


వ.

అని క్రమంబున విశిష్టేష్టదేవతానమస్కృతియు సుకృతిజనపురస్కృతియు దుష్కృ
తితిరస్కృతియుం గావించి చమత్కృతి మత్కృతి నిర్నిమిషాయత్తచి త్తం
బుతో నున్నయవసరంబున.

12


సీ.

తనదుకీర్తి సరోజధామకు భువనజాతమ్ములు భువనజాతములు గాఁగఁ
దనప్రతాపాగ్ని కుద్ధతనృపాలపతంగమండలంబు పతంగమండలముగఁ