చిన్ననాటి ముచ్చట్లు 69
(V.P. Hall) నందుండెను. పాత మునిసిపలు ఆఫీసు జార్జిటవున్ యర్రబాలుశెట్టి వీధిలో యుండెను. ఇప్పడు బీచిలో యున్న కొత్త నేషనల్ బ్యాంకి కట్టడముండు స్థలమున (Singler School) ఉండెను. ఈ నేషనల్ బ్యాంకిని, ఇంపీరియల్ బ్యాంకిని (ముందు మద్రాసు బ్యాంకి) కట్టినది కూడ నాకు తెలుసును. పాత నేషనల్ బ్యాంకి ఆర్మీనియన్ స్ట్రీటులోను మద్రాసు బ్యాంకి బ్రాడ్వేలోను వుండినవి. పోర్టు ఆఫీసుకు సంబంధించిన క్రొత్త కట్టడము లన్నియు కట్టినది నాకు తెలుసు. పాత హార్బరును మార్చి, ఇప్పడు కట్టిన నూతన హార్బరును కట్టినదియు తెలుసును. పాత హార్బరు మీద శనివారము ఆదివారము కొందరము చేరి పికారుకు వెళ్ళుచుంటిమి. దీనినే అప్పడు యినుపవారధి అని పిలుచు చుండిరి. మౌంటురోడ్డులో యుండిన T.R. Tawker & Sons న స్పెన్సరు కంపెనీ కట్టడమును కట్టినది నాకు తెలియును. పాత యస్.ఐ.ఆర్. స్టేషన్ (S.I.R. Station)ను మార్చి ఇప్పటి కట్టడమును కట్టినది, బీచి స్టేషన్ కట్టినది, మూరు మార్కెట్టును కట్టినది దెలియును. మద్రాసులో ముందుండిన పాతమార్కెట్టు ఇప్పుడు శ్రీరాముల పార్కు అను స్థలమున బ్రాడ్వేలో నుండెను. ఇప్పటి 'లా' కాలేజి నేను చూచుచుండగ కట్టినదే. ఈ 'లా' కాలేజీని కట్టకముందు, B.L. క్లాసులు హైకోర్టు భవనమునందే జరుగుచుండెను. ఆ క్లాసులు ఉదయము 10 గంటల లోపుగనే జరుగుచుండెను. అప్పడా క్లాసులకు ప్రొఫెసర్లుగ ప్రసిద్దులగు రామచంద్రరావు సాహేబు, టి.వి. శేషగిరి అయ్యరు, మొరిశెట్టి వెంకట్రామశెట్టిగారు, సుబ్రహ్మణ్యయ్యరు మొదలగు వారుండిరి.