Jump to content

పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ననాటి ముచ్చట్లు169

బళ్లారి సరసవినోదనీ సభవారి నాటకములు ప్రజారంజకములగుట జూచి చెన్నపురియందలి విద్యావంతులకును ఉత్సాహము కలిగినది. ఆ ఉత్సాహ ఫలితమే సుగుణవిలాససభ. ఇది 1891లో ఏర్పరుపబడినది. ప్రథమమున దీనిలో చేరినది 7 గురు సభ్యులు. ఇది కొంతకాలమునకు విక్టోరియా పబ్లిక్ హాలులో ఉంచబడి అందే అభివృద్ధి గాంచినది. పిదప మౌంటురోడ్డులో దీనికి స్వంత భవనమేర్పడినది. ఈ సభలో అరవలు ఆంధ్రులుకూడ కలిసి సభ్యులుగ నుండిరి. నా చిన్నతనమున ఈ సభలో సభ్యుడుగా నుండుట గౌరవ చిహ్నముగా నుండెడిది. నేనుకూడ ఈ సభలో సభ్యుడనైతిని. ఈ సభవారు ప్రథమములో ఆంగ్లాంధ్ర ద్రావిడ సంస్కృత కన్నడభాషలలో నాటకములాడుచుండిరి.

ఈ నాటకసభకు సూత్రధారులు శ్రీ దివాన్ బహుదూర్ సంబంధ మొదలియారుగారు. వీరు కొన్నాళ్లు ప్రెసిడెన్సీ మాజిస్ట్రేటు ఉద్యోగమును నిర్వహించిరి. అరవ నాటకములను వ్రాసి సభ్యులచే నాడించుచుండిరి. స్వంతముగ వేషములను వేసి సభ్యులను సంతోషపెట్టుచుండిరి.

ఈ సభవారి తెలుగు నాటకములలో బళ్లారి రాఘవాచారిగారును, నెల్లూరివారైన కందాడై శ్రీనివాసన్ (దొరస్వామి) గారును వేషములు వేయుచుండిరి.

నేను మొదట చూచిన వీరి తెలుగు నాటకము 'వరూధిని'. ఈ సభాసభ్యులలో కృష్ణస్వామి అయ్యర్ గారను అరవవారొకరుండిరి. వరూధిని పాత్రను ఆ అయ్యర్ గారు ధరించేవారు. కంఠస్వరము కిన్నెర స్వరమును బోలియుండును.

"ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర"