పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/738

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

842



నా ముక్త్యాల ప్రయాణము

(30-11-1935 సం||ర కృష్ణాపత్రిక నుండి)

స్వస్తిశ్రీ క్రోధన సం|| శ్రావణ మాసంలో (1925 సం!! ఆగష్టు నెలలో) నాకు శ్రీ ముక్త్యాల సంస్థానాన్నుంచి తంతి ద్వారాగా ఆహ్వానం వచ్చింది. మా పాఠశాలోపాధ్యాయులు పాలంకి గంగాధరశాస్త్రిని తోడుగా తీసికొని నేను ప్రయాణం చేశాను. బోనగల్లు స్టేషనువఱకూ రైలే గాని అక్కడ నుంచి త్రోవలో యేదోవకయేరు తటస్థిస్తుంది, అంత వరకూ మోటారు. ఆ యేఱు వర్షాకాలమవడం చేత నిండుగా పాఱుతూ వుంది. అదేమిటో, ఆ యేట్లో నీ రెంతో అంత యిసుకకూడా ప్రవహిస్తూ వుంటుంది. గోదావర్యాది నదులలోవలెఁగాక ఆ యేఱు దాఁటించే పడవల మాదిరి వేఱు. వాటికి చక్రాలుంటాయి. ఏఱు దగ్గిఱికి పెందలకడనే వెళ్ళేముకాని, వంతుల ప్రకారం దాఁటించడం కనుక మావంతు వచ్చేటప్పటికి కొంత ఆలస్యమయింది. అదేనా కొన్ని శిఫారసుల మీఁదగాని లేకపోతే ఆ మాత్రం ఆలస్యంలో కూడా తేలదన్నమాటే. అవతలి కెళ్ళేటప్పటికి రెండు జాములు కావచ్చింది. మళ్లా అవతలి వొడ్డున కంటిన్యూగా మోటారు వుండడంచేత దానిద్వారా సుమారు మధ్యాహ్నం వంటిగంటకు జగ్గయ్యపేటకు చేరుకున్నాము. ఎప్పుడో అప్పటికి సుమారు ముప్ఫైయేళ్లనాఁడు కాశీప్రయాణంలో ఆ వూరు వెళ్లడమే కాని యిటీవల యెన్నఁడూ వెళ్లినట్లు లేదు. అందుచే పేరువిన్న వాళ్లేకాని మనిషి నెఱిఁగినవా ళ్లుండక పోవడం చేత వంటపూటింటికి వెళ్లాలని అనుకుంటూ వుండంగా మాతో పాటుగా మోటారు దిగిన గృహస్థొకాయన వారింటికి ఆతిథ్యానికి తీసుకువెళ్లారు.

నాఁడు శ్రావణ శుక్రవారం నోము. యింకా కొంతాలస్యం ఆ కారణంచేత అయిందికాని, వక కొత్త విశేషం కనిపెట్టినట్లు సంతోషించాను. యేమిటంటే : మావైపున కూడా యీ వ్రతం లేకపోలేదుగాని, దీనిలో స్త్రీలతోపాటు పురుషులు పాల్గొనడం మాత్రం నేనెక్కడా చూడలేదు. బందరులో సుమారు పదమూడేళ్లు నేనున్నానుగాని, అక్కడ యీ సంప్రదాయం వుందో లేదోగాని చూడలేదు. నేఁటికి “కాకతాళీయంగా” జగ్గయ్యపేటలో తటస్థించినందుకు సంతోషంగానే వుంది గాని అప్పటికే నేను పెసరబద్దంత నల్లమందు వకపూట వేసుకొనే అభ్యాసంవుండడంవల్ల ఆలస్యమవుతోందని యిబ్బందిగా కూడా వుంది.