పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

చాటుపద్యరత్నాకరము

   బింబోష్ఠి యని నీవు బెదిరింపకు శుకంబ!
               సాంకవామోద యీ సన్నుతాంగి
   కంజాస్య యని నీవు కలహింపకు మృగాంక!
               స్వర్భానువేణి యీ జలజపాణి
   శ్వాస వక్షోజ వచనాస్యబాంధవముల
   బంధువులు గాన మీకుఁ జెప్పంగవలసె
   నిట్లు వినకుండినఁ బరువు లిడుట యెగిరి
   పడుట వదరుట కుందుట ఫలముసుండి!

చ. సరసిజనేత్ర! నీవిభునిచారుతరం బగుపేరుఁ జెప్పుమా!
   అరయఁగ నీవు నన్నడుగునాతనిపే రిదె చిత్తగింపుమా!
   కరియును రక్కసుండు హరుకార్ముకమున్ శర మద్దమున్ శుకం
   బరుదుగ వీనిలో నడిమి యక్కరము ల్గణుతింపఁ బేరగున్.

చ. నగతనయన్ ధరన్ సిరిన్ నాలుగువర్ణములన్ లిఖించి పొం
   దుగఁ దుది నొక్కయక్కరము దూకొని వ్రాయగ నింపుమీఱగా
   నగును గజాననుండు మఱి యాదిగ నొక్కొక యక్కరంబు దిం
   చగఁ జతురాననుండు శరజన్ముఁడు పంచశరుండు వహ్నియున్.

చ. అరయఁగ నాఱువర్ణముల నర్జునుపేరు లిఖించి చూడ నా
   యమరవిభుండు షణ్ముఖుఁడు నక్షిపయోరుహవైరిమేదినీ
   సుమశరు లయ్యెడిన్ మఱియుఁ జోద్యము దానితుదాది చేసినన్
   గమలయు భూమిసంభవుఁడు కాంతియు స్వర్గము గాఁ గనంబడున్.

చ. సతికుచవాక్సమత్వ మరిజాతసుధ ల్గొనఁ బూని వాదులై
   హతులయి వారిజాతవసుధాకృతు లూని యు దృఙ్నితంబని
   ర్జితరుచి గాంచియుం దుది నరిత్వము జెందినచంద్ర శేవధి
   స్థితిని ముఖాంగముల్ గెలిచె సీ తగ దిన్నిట నొంటి నోడినన్.