పుట:Chandrika-Parinayamu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకు

భాషలో వస్తున్న క్రమవికాసాన్నీ, సాహిత్య సృష్టిలో రచయితలు చేస్తున్న ప్రయోగాలనూ, సమకాలీన సాంఘిక వృత్తాన్నీ, మహా కవులు సాధించిన సిద్ధులనూ అవగతం చేసుకోవడానికి ప్రాచీనార్వాచీన కావ్యాలతో పరిచయం సంపాదించుకోవలసిన అవసరం సహృదయులకు ఎప్పుడూ ఉంటుంది. విశేషించి రచయితలకూ, పరిశోధకులకూ, విద్యార్థులకు వినిధ సాహిత్య ప్రక్రియల్లో వెలువడిన రచనలతో ఎడతెగని సంబంధం ఉంటుంది. ఈ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని సాహిత్య అకాడమీ అప్పుడెప్పుడో ముద్రణ పొంది, ఇప్పుడు అలభ్యంగా ఉన్న పుస్తకాలను విద్వత్పీఠికలతో కైసేసి ప్రచురిస్తున్నది. శతాధికంగా అకాడమీ వెలువరించిన ప్రాచీనకావ్యాలను తెలుగు పఠితృలోకం సాభిమానంగా, సాదరంగా స్వీకరించి అకాడమీ కార్యక్రమాలకు అండగా నిలిచి ప్రోత్సహిస్తున్నది.

16వ శతాబ్దంలో జటప్రోలు ప్రభువైన సురభి మాధవరాయలు రచించిన “చంద్రికాపరిణయము" అనే ప్రౌఢకావ్యాన్ని ఇప్పుడు అకాడమీ అందిస్తున్నది. 1828లో ఇది తొలిసారిగా సవ్యాఖ్యానంగా ప్రచురితమైనది. కానీ ఇప్పుడు ప్రతులు లేవు. మాధవరాయలు బహుశాస్త్రాలలో నిష్ణాతులు. వసుచరిత్ర వలెనే ఈయన చంద్రికాపరిణయము విద్వల్లోకంలో, సహృదయకదంబంలో, సరసకావ్యంగా, హృద్యమైన శ్లేషలకు ఆకరంగా, ప్రౌఢప్రయోగాలకు కాణాచిగా, నూత్నపదసంయోజనకు నిదర్శనంగా, వినూత్న కల్పనలకు, సుందరపదబంధాలకు నేవధిగా, ప్రసిద్ధిని పొందినది. విద్వాంసులైన సహృదయులెందరో ఈ కావ్యాన్ని ప్రచురించవలసినదిగా అకాడమీకి సూచించినారు.

ఈ కావ్యానికి సమగ్రమైన, పాండితీవిలసితమైన, బహువిషయ వివేచనాత్మకమైన పీఠికను సమకూర్చి సంపాదకత్వాన్ని నిర్వహించిన శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి "శిరోమణి" గారికి అకాడమీ పక్షాన కృతజ్ఞతాభివందనాలను సమర్పించుకుంటున్నాను.

హైద్రాబాదు,
తేది : 7-8-1982

ఇరివెంటి కృష్ణమూర్తి
కార్యదర్శి.