పుట:Chandrika-Parinayamu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూడారత్నాయమానతారావరయును, భుజాచతుష్టయసంభృతపాశాంకుశరసాలశరాసనప్రసవరోపయును, నిజచరణసరసిజ భజనాపరాయణ సకలభువనజనోపబహిర్నిర్గతానురాగమోహద గౌరాంగరాగయును, ఆత్మోపఘన ఘనప్రభాలింగిత దివ్యమణిభూషణపూగయును, సముజ్జ్వలజ్జ్వలనమయనయనకలిత ఫాలభాగయును నగుచు జగద ద్భుతతేజోవిలసనంబున నమ్మహారాజేంద్రుముంగల నిలిచి, మంగళకరంబులగు ననేకవరంబు లొసంగి, వెండియును బావకవిబుధమహౌన్నత్యతంత్రం బగు నొక్కమంత్రంబు దెలుపం దలఁచి యానృపతి కిట్ల నియె. 138

మ. నిరవద్యంబయి, నిష్కలంకమహమై, నిర్వాపితాఘౌఘమై,
హరమాయాలవకాంచితాత్మమయి, నిత్యంబై, మహేంద్రాదిని
ర్జరసేవ్యంబయి, యిష్టదంబయి, యజస్ర మ్మొక్కమంత్రం బిలన్
అరిసంభేదన మించుఁ జుమ్ము భువనేశ్యాఖ్యాసముజ్జృంభియై. 139

ఉ. అమ్మహనీయమంత్రము రసాధిప నీ కిపు డిత్తు దానిఁ గై
కొమ్ము త్వదీహితమ్ము లొనగూర్చుఁ బఠించినమాత్రఁ దత్ప్రకా
రమ్ములు సద్గురుప్రవరరమ్యవచోగతిచే నెఱింగి ని
త్యమ్ము జపింపుమీ దినకరాభ్యుదయావసరమ్ములన్ మదిన్. 140

చ. అని భువనేశి యామనుకులాభరణమ్మున కున్నమత్కృప
న్మనుతిలకమ్ము నిచ్చి నృపమౌళి లలిన్ ఘటియించుమ్రొక్కు గై
కొని యలచంద్రికావనితఁ గూడి హరిప్రమదాదిలేఖిక
ల్తను భజియింపఁగా నెనసెఁ దత్పురరాజము సంతసంబునన్. 141

చ. అపుడు నిజాత్మలాలసిక యంతయుఁ జేకుఱ నాసుచంద్రభూ
మిపతి నిజాప్తబంధునృపమిత్రజనంబులు చేరి రా సువ
ర్ణపటహరావ మెచ్చ శిబిరస్థలిఁ జేరె నెలంత లెల్ల న
చ్చపురతనాలయారతులు చక్క నొసంగఁగ నాత్మ నుబ్బుచున్. 142