పుట:Chandragupta-Chakravarti.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

చంద్రగుప్త చక్రవర్తి


మెకడోనియనుల కమందానందము గలిగించుచు డెరయసును సంపూర్ణముగ నోడింప బయలుదేరెను. అజాగ్రత్త వలన డెరయసు ఇఱుకుప్రదేశమున యుద్ధము చేయవలసి వచ్చినందున అలకసుందరుని సైన్యము కొద్దియేయైనను సునాయాసముగఁ బారసీకులను దోలివైచెను. డెరయసు మాత్రము తప్పించుకొని పోయెను. అతని భార్యయు తల్లియు మఱియిద్దరవివాహితలగు కన్యలును నలకసుందరునిచేఁ జిక్కిరి. వారి కీతఁడు గనుపఱచిన మర్యాదవలన నితఁడు డెరయసునకే సంస్తవనీయుఁ డయ్యెను. ఆ యువిదలకు అలెగ్జాండరు రాజ వనితలకం దగు సదుపాయము లన్నియు నమర్చెను. పురుషు లెవ్వరును వారి యంతికముల కడకు పోఁగూడదని శాసించి వారి కేలాటిలోపమును రానీక కాపాడెను. డెరయ సొక్కరుఁడు లేఁడనుటఁ దక్క వారికి డెరయసునగరమునకంటె అలకసుందరుని నగరముననె నెక్కుడు సౌఖ్యము గల్పింపఁబడెను. పట్టువడిన కొన్ని మాసములకు డెరయసుభార్య గర్భస్రావమువలన మృతినొందెను. తన యుదారహృదయమును డెరయసునెడఁ జూపుటకు వీలులేకపోయెనే యని వగచుచు నలకసుందరుఁ డామెకు మహా విభవముతో నుత్తరక్రియలు జరిపించెను. ఇదివిని డెరయసు వికలమనస్కుఁడయ్యె. కాని అతనిభార్యతో గూడ పట్టువడి ఆమెయొద్ద అలెగ్జాండరువలన సేవకుఁడుగ నియమింపఁబడి ఆమె మరణానంతరము దప్పించుకొనిపోయి డెరయసుం జేరియుండిన కొజ్జాటిరియ ననువాఁడు అలెగ్జాండరు యొక్క నైర్మల్యముం బ్రశంసించి నమ్మకమగు సాక్ష్యముపలికి