పుట:Bibllo Streelu new cropped.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మార్తను క్రీస్తుకి ఆతిథ్యమిచ్చినందుకు గురుంచుకోవాలి. యోహాన్నాను క్రీస్తుకీ శిష్యులకీ తన సొంత సొమ్ముతో అన్నపానీయాలు సవుకూర్చినందుకు స్మరించుకోవాలి. అన్నాను ఎడతెరపిలేని ఉపవాసాలకూ ప్రార్థనలకు గుర్తుంచుకోవాలి. తబితను తన సొంత చేతులతోనే పేదలకు వితంతువులకు బట్టలు కుట్టియిచ్చినందుకు స్మరించుకోవాలి. ఆమె కరుణ కార్యాలకు ప్రసిద్ధికాంచింది.

పేతురు తబిత చుట్టు మూగివున్న వారందరిని వెలుపులకు పంపివేసి మోకాలూని ప్రభువుకి ప్రార్థన చేశాడు. పిమ్మట శవంవైపు మళ్లి “తబిత లే” అని పలకగానే ఆమె ప్రాణంతో లేచికూర్చుంది. పూర్వం క్రీస్తు ఈలాగే చనిపోయిన యాయిరు కొమార్తను జీవంతో లేపాడని వింటున్నాం -మార్కు 5,41. ఇంకా, పూర్వం ఏలీయా సారెఫతు వితంతువు బిడ్డడు చనిపోగా ఆ బాలుని కొరకు ప్రార్ధించి ವ°ಣ್ಣಿ జీవంతో లేపాడు -1రాజు 17,21-22. అతని శిష్యుడైన యెలీషాకూడ షూనేము భక్తురాలి బిడ్డట్టి ప్రాణంతో లేపాడు -2రాజు 4,35-36. ఈ భక్తుల్లాగే పేతురుకూడా చనిపోయిన తబితను జీవంతో లేపాడు. అక్కడకు వచ్చిన వాళ్లంతా సజీవియై తమ యెదుట నిలబడివున్న తబితను చూచి సంతోషించారు. ఆమె మళ్లా కొన్నాళ్లపాటు తన సేవాకార్యాలను కొనసాగించి పేదసాదలను ఆదుకొని వుండాలి. తర్వాత అందరిలాగే మరణించి వుండాలి.

పేదసాదలను పట్టించుకొని కరుణ కార్యాలు చేయమని తబిత ఈనాడు మనలను హెచ్చరిస్తుంది. మనది పేదదేశం. ఎందరో నిరుపేదలు కూడుగుడ్డ లేక అలమటించి పోతున్నారు. మన సమాజంలో తబితలాగ దరిద్రులను పట్టించుకొనేవాళ్లు ఎందరో వుండాలి. దేవుడు పేదలకు వసతి, అన్నం, బట్టల రూపంలోనే దర్శనమిస్తాడు. కనుక మనం ఈ సేవాకార్యాలను కొనసాగించుకొని పోవాలి. ఈ విషయంలో మదర్ తెరేసా మనకు ప్రేరణంగా వుంటుంది.