పుట:Bibllo Streelu new cropped.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వసిస్తున్నాడు. అతడు తన పట్టపురాణియైన వఫ్టిని పరిత్యజించి రెండవ రాణి కొరకు గాలిస్తున్నాడు. పేద యూద బాలికయైన ఎస్తేరు అందం అతనికి నచ్చింది. కనుక ఆమెను పెండ్లాడాడు. కాని ఆమె యూదజాతి స్త్రీ అని అతనికి తెలియదు.

అగాగు వంశజుడైన హామాను రాజుకి ప్రధానమంత్రి అయ్యాడు. మొర్టెకయి రాజకీయోద్యోగి. అతడు దేవునికి తప్ప నరమాత్రులకు నమస్కారం చేయడు. తనకు దండం పెట్టలేదన్న కోపంతో హామాను అతనిపై ద్వేషం పెంచుకొని యూదజాతి నంతటినీ నాశం చేయాలని నిశ్చయించుకొన్నాడు. అదారు నెల 13న యూదులను చంపి వారి ఆస్తులను స్వాధీనం చేసికోవడానికి రాజునుండి అనుమతిని పొందాడు. మొర్టెకయిని ఉరితీయడానికి ఉరికంబం గూడ పాతించాడు.

రాజు అనుమతి లేనిదే ఎవ్వరూ అతని చెంతకు వెళ్లకూడదు. ఆలా వెళ్లే వారికి చావు మూడిందే. ఐనా ఎస్తేరు తన జాతిని కాపాడనెంచి ధైర్యంజేసి రాజు దగ్గరికి వెళ్లింది. ఆమె పూర్ణంగా దేవుణ్ణి నమ్మింది. చస్తే చస్తానుగాక రాజు దగ్గరికి వెళ్తాను అనుకొని వెళ్లింది - 4,16. తాను యూదజాతి స్త్రీననీ, హామాను కుట్రతో తనజాతిని నాశం జేయబోతున్నాడనీ రాజుకి మనవిచేసింది. రాజుకి ఆమెంటే యిష్టం. కనుక అతడు యూదులను చంపవద్దని మరోశాసనం జారీ చేశాడు. కనుక యూదులు చావు తప్పించుకొన్నందుకు అదారు నెల 14-15 తారీఖుల్లో పెద్ద ఉత్సవం చేసికొన్నారు. ఆ పండుగకు పూరీము అనిపేరు. ఇప్పటికీ యిది యూదుల పండుగల్లో వొకటి. అసలు ఈ పండుగ యేలా పుట్టిందో తెలియజేయడానికే యీ పుస్తకాన్ని వ్రాశారు. యూదులను చంపడానికి కుట్రపన్నిన హామానుని, అతని పదిమంది కుమారులనూ గూడ ఉరితీశారు.

ఎస్తేరు అందగత్తె. దైవభక్తి కలది. ఆమె గొప్పతనం తన జాతిని వినాశంనుండి కాపాడ్డంలో వుంది. ఆమె మొదట పేదబాలికగా వుండి