పుట:Bibllo Streelu new cropped.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అబ్సాలోము అమ్మోనును హత్యజేశాడు. దావీదు అబ్సాలోముపై కోపించి అతన్ని దేశంనుండి బహిష్కరించాడు. అతడు మూడేండ్లు గెషూరు దేశంలో ప్రవాసంలో వున్నాడు.

దావీదు సైన్యాధిపతి అతని మేనల్లుడైన యోవాబు. అతడు తండ్రీకుమారులకు సఖ్యత చేకూర్చగోరాడు. తేకోవ నగరంలో జ్ఞాని, నేర్పరియైన మహిళవుంది. అతడు ఆమెకు విషయం తెలియజెప్పి, చిన్న కథకూడ చెప్పి రాజుదగ్గర ఆ కథనునటించిచూపించమని పంపాడు.

ఆ మహిళ వితంతువైన తల్లిలాగ నటిస్తూ రాజదగ్గరికి వచ్చి తనకథ చెప్పింది. అయ్యా! నాకిద్దరు కుమారులు. వాళ్లకు పోట్లాటవచ్చి పెద్దవాడు చిన్నవాణ్ణి చంపివేశాడు. మావూరిలోని జనం రక్తపాతం కావించినందుకు పెద్దవాణ్ణికూడ చంపబోతున్నారు. నేను పెనిమిటిలేని వితంతువుని. ఉన్నవాడుకూడ పోతే ఇక నేనేలా బ్రతికేది అని మొరపెట్టుకొంది. రాజు నీ పెద్దకొడుకుమిద ఈగవాలదుపో అని అభయమిచ్చాడు. ఆ కథమర్మం విప్పి చనిపోయినవాడు బ్రతికిరాడు. బ్రతికివున్నవాణ్ణి కూడ పోగొట్టికోవడ మెందుకు అని అడిగింది. రాజు ఆమె తన కుమారుడు అబ్సాలోమునుగూర్చే మాట్లాడిందని గ్రహించాడు. యోవాబే ఆమెను తనవద్దకు పంపాడని గూడ అర్థంజేసికొన్నాడు. అబ్సాలో మును ప్రవాసంనుండి పిలిపించడానికి అంగీకరించాడు.

దావీదు న్యాయాన్ని పాటించవలసిన రాజుగా కొడుకును బహిష్కరించినా తండ్రిగా కుమారుని కొరకు విలపిస్తూనే వున్నాడు. పై మహిళ దావీదులోని ఈ తండ్రి గుణాన్ని మేలుకొల్పింది. రాజుముందు బాగా నటన చేసింది. కనుక యోవాబు ప్రణాళిక నెరవేరింది.

దావీదు తిరిగి వచ్చిన అబ్సాలోమును మొదట తన సన్నిధిలోనికి రానీయలేదు. కాని తర్వాత కొడుకువచ్చి తండ్రి ముందు చాగిలపడ్డాడు.