పుట:Bibllo Streelu new cropped.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దిగివచ్చింది. యెఫా పోరున శత్రువులను ఓడించి ఇంటికి తిరిగివస్తున్నాడు. ఇంటి దగ్గరికి రాగానే అతని ఏకైక పుత్రిక తండ్రికి స్వాగతం చెప్పడానికి నాట్యం చేస్తూ ఎదురు వచ్చింది. ఆమెను చూడగానే యొఫాగుండెలు పగిలాయి. తల్లీ! నీవు నా కడుపున చిచ్చు పెట్టావు. నేను దేవునికి మాట యిచ్చాను. నిన్ను బలి యీయక తప్పదు అని వాపోయాడు - న్యాయాధి 11,35. కూతురు ఏమిరా యెదురు చెప్పకుండ నాన్న! నీవు దేవునికి మాటయిచ్చినట్లే చేయి అంది. ఆమె కంటనీరు పెట్టలేదు. ఆపసోపాలు పడలేదు. తండ్రి ఆజ్ఞకు పూర్ణంగా విధేయురాలు ఐంది.


హీబ్రూ యువతి ఎవరైనాసరే సంతానం లేకుండ చనిపోవడం శాపంగా భావించేది. యెఫా కూతురు రెండు నెలలు గడువుకోరింది. ఆ కాలంలో కొండల్లోకి వెళ్లి వ్యర్థమైపోయిన తన కన్యాత్వాన్ని తలంచుకొని పరితపించింది. ఆమె తండ్రికంటపడకుండ కొండల్లో దాగుకొని వుండవచ్చు. కాని గడువు ముగియగానే ఇంటికి తిరిగి వచ్చింది. ధైర్యంగా తండ్రీ! నీవు బాసచేసినట్లే నన్నుబలిగా సమర్పించు అంది. యిప్రాయేలీయులు నరబలి సమర్పించకూడదు - లేవీ 18,21. ఐనా యెప్తా తనమాట నిలబెట్టుకోవడానికి ముద్దుల కూతురునే దేవునికి దహనబలిగా సమర్పించాడు. న్యాయాధిపతుల కాలంలో ప్రజల్లో భక్తి విశ్వాసాలు సన్నగిల్లాయి. ప్రతివాడు దేవుని చిత్తప్రకారం గాక, తన కిష్టమొచ్చినట్లుగా దేవుణ్ణి పూజించేవాడు. యెప్తాకూడ ఈ పొరపాటే చేశాడు. దేవుని ఆజ్ఞలను ఏలా అర్ధం చేసికోవాలో అతనికి తెలియలేదు. కనుక అతని ఘాతుకం క్షమించదగింది.


మనం అతని కొమార్తె హృదయాన్ని అర్థంజేసికోవాలి. ఆమె దేవుణ్ణి తన ప్రజనూ తన తండ్రినీ ప్రేమిచింది. ఈ త్రివిధ ప్రేమతోనే ఆత్మార్పణం చేసికోవడానికి ముందుకు వచ్చింది. ఆమె నిప్పలాంటి మనిషి పవిత్ర కన్య బైబులు ఆమె పేరేమిటో చెప్పదు.