పుట:Bibllo Streelu new cropped.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిస్థితుల్లో పై యైదుగురు కూతుళ్లు ధైర్యంగా మోషేనుసమిపించి తమ హక్కులను కాపాడుకొన్నారు. వీళ్లు స్త్రీల స్వేచ్ఛకొరకు పోరాడే వాళ్లందరికీ ఆదర్శంగా వుంటారు. కూతుళ్లు కొడుకులతో సమానమని నిరూపిస్తారు. మూడువేల యేండ్లు గడిచాక ఇప్పుడు మనకు కూడ ప్రేరణం పుట్టిస్తారు.

14. యూదుల్లో కలసిపోయిన అన్యజాతిస్త్రీ రూతు

బైబుల్లోని 73 పుస్తకాల్లో మూడింటికి మాత్రమే స్త్రీల పేర్లున్నాయి. అవి రూతు, ఎస్తేరు, యూదితు. ఈ మూడు గ్రంథాలు చదవడానికి ఆసక్తికరంగానే వుంటాయి. రూతుఅంటే స్నేహితురాలని అర్థం. పేరుకి తగ్గట్టుగానే ఆమె అత్తకు మంచి నేస్తం. చాల మంది బాలికలకు రూతుపేరు పెడుతుంటారు. ఆమె అన్యజాతి మహిళ. ఐనా మనతోటలో పూచిన గులాబివలె ప్రక్కవారితోటలోని గులాబికూడ సువాసనలు గుబాళించవచ్చు. యూదులు రూతుగ్రంథాన్ని పెంతెకొస్తు పండుగ సందర్భంలో చదువుతారు. మత్తయి క్రీస్తు వంశావళిలో రూతుపేరుకూడ పేర్కొన్నాడు -1.5.

ఎలీమెలెకు భార్య నవోమి. వారికి మహ్లోను కిల్యోను అని యిద్దరు కుమారులున్నారు. ఒక పర్యాయం యూదయదేశంలో కరువురాగా ఆ కుటుంబం మోవాబు దేశానికి వలసపోయింది. కొడుకు లిద్దరూ మోవాబు పడుచులను పెండ్లిచేసికొన్నారు. పెద్దకోడలు ఓర్ఫా, చిన్నకోడలు రూతు. తండ్రి కుమారులు కూడా ఆ పరదేశంలోనే కన్నుమూశారు. కొడుకులకు సంతానం లేదు. ఎలీమెలెకు కుటుంబాన్ని నిలబెట్టడం ఎలాగన్నది పెద్ద సమస్య ఐంది.

సొంతదేశంలో వానలు కురవగా నవోమి తిరిగి రాగోరింది. కోడండ్లను పుట్టినింటికి వెళ్లిపోయి వాళ్ల దేవుళ్లను కొల్చుకొమ్మంది. అత్త కోరికప్రకారం ఓర్ఫా వెళ్లిపోయింది. రూతు అత్త పట్లగల గాధానురాగం వలన ఆమెకు అంటిపెట్టుకొని వుండిపోయింది. ప్రపంచ సాహిత్య మంతటిలోను అత్తాకోడళ్ల అనుబర్తర్టాన్ని చిత్రించే కథ ఇదొక్కటే.