పుట:Bibllo Streelu new cropped.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. సెలోఫెహాదు కొమార్తెలు

సెలోఫెహాదు మనష్షె తెగకు చెందినవాడు. అతడు కుమారులు లేకుండానే ఎడారి ప్రయాణంలో మరణించాడు. కనుక అతని కుటుంబం పేరు అంతరించవచ్చు. అతడు మంచివాడు. కోరా తిరుగుబాటులో పాల్గొనలేదు. అతనికి ఐదుగురు కూతుళ్లున్నారు. వాళ్లు నాయకుడైన మోషే దగ్గరికి వచ్చి మాకుటుంబంలో మగపిల్లలు లేరు. కనుక మా తండ్రి పేరు మాసిపోతుంది. అందుచే మా తండ్రి ఆస్తి మాకు సంక్రమించేలా చేయి. మేము ఆయన పేరు నిలబెడతాం అని అడిగారు. మోషే యావేను సంప్రదించి వాగ్దాత్త భూమిలో తండ్రికి రానున్న ఆస్తిని కూతుళ్లపరం జేశాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే సెలోపెహాదు కూతుళ్లు తమ హక్కులను నిలబెట్టుకొన్నారు. కుటుంబంలో మగపిల్లలు లేకపోతే తండ్రి ఆస్తి పరాయివాళ్లకు దక్కుతుంది. అతని పేరుకూడ మాసిపోతుంది. తండ్రి ఆస్తి కూతుళ్లకురాదు. ఈ పరిస్థితుల్లో ఈ కూతుళ్లు మగపిల్లల్లాగా ప్రవర్తించి తండ్రి పేరు నిలబెట్టారు. అది వారి ఘనత - సంఖ్యా 27, 1-11. 

మోషే ఒక్క షరతుపెట్టాడు. ఈ కూతుళ్లు మనషె తెగలోనే పెండ్లి చేసికోవాలి. అప్పడు వారిఆస్తి అన్యాక్రాంతం కాదు. కూతుళ్లు ఈ షరతును పాటించారు. ఏ కుటుంబం ఆస్తి ఆకుటుంబంలోనే వుండాలని యూదుల కోరిక.

ప్రాచీన కాలంలోను ఆధునిక కాలంలోను గూడ స్త్రీల హక్కులకు భంగం కలుగుతుంది. వారికి సమాజంలో గుర్తింపు లేదు. వ్యక్తిత్వం లేదు. ఆడశిశువులను గర్భంలోనే చంపివేయడం, వరకట్నం, లైంగిక వేధింపులు, సమానమైన పనికి సమానవేతనం లేకపోవడం, చిన్నచూపు మొదలైన నానా సమస్యలు స్త్రీలను బాధిస్తుంటాయి. ఈలాంటి