పుట:Bibllo Streelu new cropped.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇద్దరు పిల్లలు కలసి ఆడుకోవడం సారా చూచింది. ఆమెకడుపులో నుండి అసూయ పెల్లుబికి వచ్చింది. భర్తతో ఈ బానిస తొత్తునీ దాని కొడుకునీ ఇంటినుండి గెంటివేయి. వీడు నా కొడుకుతోపాటు మన ఆస్తి పంచుకోవడానికి వీల్లేదు అంది -21, 10. దేవుడు కూడ అబ్రాహాముని సారా చెప్పినట్లే చేయమన్నాడు. తాను ఇద్దరు కుమారులనూ దీవిస్తాననీ, కాని ఈసాకు ద్వారా మాత్రమే అబ్రాహాము వంశం వ్యాప్తి చెందుతుందనీ చెప్పాడు.

కనుక అబ్రాహాము నీటితో నిండిన తోలుతిత్తినీ భోజనం పొట్లాన్నీ యిచ్చి హాగరుని యింటినుండి సాగనంపాడు. తల్లి బిడ్డడితో పాటు మళ్లాయెడారికి వచ్చింది. అక్కడ తాను తెచ్చుకొన్న తిండీ నీళ్లు ఐపోయాయి. ఆమీరాదట వారికి ఎడారిలో నీళ్లు దొరకలేదు. పైన ఎండ మిడిసిపడుతూంది. తల్లీ కొడుకూ దాహంతో తపించి పోయారు. ఆమె నేనీ బిడ్డడి చావు చూడలేను అనుకొని బోరున యేడ్చింది - 21, 16. యిష్మాయేలు దప్పికవలన సొమ్మసిల్లి పడిపోయాడు. కాని దేవుడు ఆ తల్లీ కొడుకుల ఆక్రందనం విని వారిని కరుణించాడు. దేవదూత దర్శనమిచ్చి హాగరుని ఊరడించాడు. యిష్మాయేలు నుండి మహాజాతి ఉద్భవిస్తుందని చెప్పాడు. దేవుడు హాగరు నేత్రాలను విప్పగా ఆమెకు దాపులోనే బావి కన్పించింది. ఆమె తోలుతిత్తితో నీళ్లు తెచ్చి పిల్లవాడికి పట్టించింది. ఇద్దరూ బ్రతికిపోయారు. అబ్రాహాముతోలుతిత్తిలో పట్టినన్ని నీళ్లు మాత్రమే ఈయగా దేవుడు ఒక బావినే యిచ్చాడు.

యిష్మాయేలు పెరిగి పెద్దవాడై గొప్ప వేటగాడయ్యాడు. తల్లి ఒక యీజిప్టు పిల్లను తెచ్చి అతనికి పెండ్లి చేసింది. యిష్మాయేలు సంతానమే నేటి ఆరబ్బులు. ఈసాకు సంతానం నేటి యూదులు. ఈ యిరు జాతులకు మధ్య నేటికీ చిచ్చు రగులుతూనే వుంది.

హాగరుకథ మనకు చాల పాఠాలు నేర్పు తుంది. ఆమెసారాకు కొద్దిపాటిద్రోహం చేసింది. కాని సారా ఆమెకు పెద్ద ద్రోహం చేసింది. ○