పుట:Bibllo Streelu new cropped.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృతజ్ఞతా పూర్వకంగా అతనికి భోజనం వడ్డించింది. అటుతర్వాత క్రీస్తు అనేక పర్యాయాలు పేతురు అత్తనుండి ఆతిథ్యం స్వీకరించి వుండాలి - మత్త 8,14-15. ఆలాగే అతడు బెతనీ గ్రామంలో వసించే మరియా మార్తల యింటిలో గూడ ఆతిథ్యం పుచ్చుకొన్నాడు -లూకా 10,3842. పేషిత ప్రయాణాల్లో కొందరు స్త్రీలు తమ డబ్బుతోనే అతనికి భోజనం సమకూర్చే వాళ్లని ముందే చెప్పాం -లూకా 8,3. ఈ వుదాహరణలను బట్టి అతడు స్త్రీలతో సులువుగా కలిసేవాడనీ వాళ్లు పెట్టిన అన్నాన్ని గూడ ఆదరంతో భుజించేవాడని అర్ధం జేసికోవాలి.

3. స్త్రీలను సమర్ధించడం, ప్రశంసించడం

యూద సమాజంలో స్త్రీలకు చాల అన్యాయాలు జరుగుతుండేవి. కనుక క్రీస్తు వారికోపు తీసికొన్నాడు. వారిని మెచ్చుకొన్నాడు. ఒకోసారి తప్పుచేసిన స్త్రీలను గూడ సమర్ధించాడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యూదులు రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధమయ్యారు. క్రీస్తు మీలో తప్పలేనివాడు ఆమె మీద మొదటిరాయివేయండి అన్నాడు. ఎవడూ ఆమె మీద రాయి విసరడానికి సాహసించలేదు. ఇక్కడ క్రీస్తు ఆమె పాపాన్ని సమర్ధించలేదు. కాని ఆ పాపాత్మురాలిని సమర్ధించాడు. కరుణతో ఆమె తప్పిదాన్ని మన్నించాడు. కాని యూదుల పాపాలను మాత్రం వ్రేలెత్తి చూపాడు - యోహా 8, 7-11.

సీమోను ఇంటిలో క్రీస్తు పాదాలకు పరిమళ ద్రవ్యం పూసిన వ్యభిచారిణి మరియు కథ కూడ ఈలాంటిదే. సీమోను ఈమెను పాపినిగా గణించి ఖండించాడు. కాని క్రీస్తు ఈమెను సమర్ధించాడు. ఈమె క్రీస్తు బోధను విని విశ్వసించింది. సీమోను అలా విశ్వసించలేదు. ఈమె పశ్చాత్తాపపడ్డంవల్ల ప్రభువు ఈమె పాపాలను మన్నించాడు. కాని సీమోను తన పాపాలకు పశ్చాత్తాపపడనూలేదు, పాప క్షమను పొందనూలేదు. ఈమె క్రీస్తుకు మర్యాదచేసింది. సీమోను ఈ మర్యాద కూడ చేయలేదు. కనుక తాను నీతిమంతుణ్ణని యెంచే సీమోను కంటె మరియయే ఉత్తమురాలని క్రీస్తుభావం - లూక్తా_,36-48.