పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని మనం సత్యమార్గం నుండి వైదొలగాం
ధర్మజ్యోతి మనమీద ప్రకాశింపలేదు
నీతిసూర్యుని పొడుపుని మనం దర్శింపనేలేదు
మనం నడవని దుష్టమార్గాలు లేవు
త్రోవల్లేని యెడారులందెల్లా తిరుగాడాం
దైవమార్గాన్ని మాత్రం విస్మరించాం
మన అహంకారంవల్ల మనం పాముకొన్నదేమిటి?
మన సంపదల వలన మనకు ఒరిగిన దేమిటి?
అవియెల్ల యిపుడు నీడలా గతించాయి
వదంతుల్లాగ దాటిపోయాయి
మనం పుట్టగానే చచ్చాం
మనం చేసిన పుణ్యకార్యాలు ఏమీలేవు
మన దుష్టత్వమే మనలను నాశం చేసింది - సాలోమోను జ్ఞాన - 5,4-13.

16. రాజకీయ, ఆర్థిక రంగాలు

ప్రభువే రాజులను నియమిస్తాడు. మంచిరాజు ప్రజలకు మేలు చేస్తాడు. చెడ్డరాజు కీడు చేస్తాడు.

విజ్ఞతగల పాలకుడు తన ప్రజలకు శిక్షణనిస్తాడు
అతని పరిపాలనం క్రమబద్ధంగా వుంటుంది
పాలకుడు ఏలాంటివాడో
ఉద్యోగులూ ఆలాంటివా రౌతారు
ప్రజలుకూడ అతనిలాంటివారే ఔతారు
విద్యారహితుడైన ప్రభువు ప్రజలను చెరుస్తాడు
పాలకులు విజ్ఞలైతే ప్రభుత్వం బాగుపడుతుంది
ప్రభువే లోకాన్ని పాలిస్తాడు
అతడు తగిన కాలంలో తగినవాణ్ణి పాలకుణ్ణి చేస్తాడు
ఆ పాలకుని విజయం ప్రభువు చేతిలో వుంటుంది
ఏ యధికారి కీర్తియైన ప్రభువుమీదనే ఆధారపడి వుంటుంది
గర్జించేసింహం, ఎరకొరకు తిరిగే ఎలుగూ ఏలాంటివో
పేదలపై అధికారం నెరపే దుష్టపాలకుడు ఆలాంటివాడు - సీరా 10, 1-5.
సామె 28, 15.