పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. పరలోక జపం

బైబులు భాష్యం - 138

పరలోక జపం - ప్రభువు ప్రార్ధనం

క్రీస్తు ఒకచోట ఏకాంతంగా ప్రార్థన చేసుకొంటుంటే చూచి శిష్యులు తమకు కూడ ప్రార్థన నేర్పమని అడిగారు. ఆ సందర్భంలో అతడు పరలోకజపం నేర్చాడు - లూకా 11,1. లూకా సువిశేషంలో ఈ జపానికి 5 విన్నపాలు మాత్రమే వున్నాయి. కాని మత్తయి సువిశేషంలో 7 వినపలునాయీ . దీనిలో సువిశేషబోధ అంతా సంగ్రహంగా ఇమిడి వుంది.

ఈ జపంలో లేని అంశాలేవీ బైబుల్లోని ఇతర జపాల్లో కన్పించవని అగస్టీను భక్తుడు నుడివాడు. మన క్రైస్తవ సంప్రదాయంలో ఈ జపానికి మించింది మరొకటి లేదు. ఇది అన్నివిధాల పరిపూర్ణమైన జపం, దీనిలో మనకు అవసరమైన వరాలన్నీదేవునినుండి అడుగుకొంటాం. పైగా వాటిని అడుగవలసిన వరుసక్రమంలో గూడ అడుగుతాం.

పర్వత ప్రసంగం క్రీస్తు బోధల సారం. దానిలో మన జీవితానికి అవసరమైన అంశాలన్నీ వున్నాయి. కాని ఈ యంశాలు మనకు ఏలా లభిస్తాయి? ప్రార్ధన ద్వారానే. ఐతే, ఉత్తమ ప్రార్ధనం పరలోకజపమే. కనుక దీనిద్వారానే మనం పర్వత ప్రసంగం పేర్కొనే భాగ్యాలను పొందాలి.

ఈ జపానికి "ప్రభువు ప్రార్ధనం" అని పేరు. ఇది క్రీస్తు స్వయంగా తండ్రికి చేసింది. దీన్ని మనకు నేర్పినవాడు క్రీస్తు తండ్రి తనకు తెలియజేసిన సత్యాలనే క్రీస్తు ఈ ప్రార్థనలో మనకు తెలియజేసాడు. నరులమైన మన అవసరాలన్నీ గుర్తించే క్రీస్తు ఈ జపాన్ని సిద్ధంజేసాడు. అతడు మనకు బోధకుడూ ఆదర్శమూర్తీ కూడ.

ఐతే మనం ఈ జపాన్ని యాంత్రికంగా చేస్తే సరిపోదు. పవిత్రాత్మ శక్తితోను ప్రేరణంతోను "దీన్ని జపించాలి. దేవుడు మన హృదయాల్లోనికి ఆత్మను పంపాడు. ఆ యాత్మ సహాయంతోనే మనం దేవుణ్ణి తండ్రీ! అని సంబోధిస్తాం - గల 4,6. కనుక ఆత్మ బలంతోనే మనం తండ్రినుద్దేశించి ఈ ప్రార్థనను జపించాలి. జపం ద్వారా మన కోరికలను దేవునికి తెలియజేసేది ఆత్మే అందుచే ఈ ప్రార్థనలో క్రీస్తు, ఆత్మ - ఇద్దరి ప్రమేయం వుంది.