పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

     ఫాదర్ పూదోట జోజయ్య,SJ. గారు,పూదోట మరయ్య, చిన్నమ్మ దంపతులకు 1931వ సం| ఫిబ్రవరి 15న, గుంటూరు జిల్లాలోని కనపర్రు గ్రామంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యను కనపర్రులో ఉన్నతవిద్యను ఫిరంగిపురంలో అభ్యసించారు. మద్రాసు లొయోలాలో కళాశాల విద్యను పూర్తిచేసి, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో M.A. (సాహిత్యం) లో పట్టా పుచ్చుకున్నారు.
   1955లో తమిళనాడులోని దిండిగల్ నందు యేసుసభలో చేరిన జోజయ్యగారు, అటుపిమ్మట కొడైకెనాల్లో తత్వశాస్రాన్ని, కర్సియాంగ్లో వేదాంతశాస్రాన్ని నిశిత పరిశీలనా దృష్టితో క్షుణ్ణంగా అధ్యయనం గావించారు. 1965, మార్చి 27న బిషప్ ముమ్మడి ఇగ్నేప్యస్ గారి చేతుల మీదుగా ఫిరంగిపురంలో గురుపట్టం పొందారు.
   రోమనగరంలోని బిబ్లికల్ ఇన్స్టిట్యూట్లో బైబులు విద్యనభ్యసించిన జోజయ్యగారు ఆ తర్వాత తనదైన విశిష్టశైలిలో బైబులు సాహిత్యానికి ఎనలేని సేవ చేసారు. లొయోలా కళాశాలలో 2 సంవత్సరములు ఉపన్యాసకునిగా విద్యార్థులకు చక్కని శిక్షణను అందించారు. పుస్తకరచన, బైబులుబోధ, విద్యార్థులకు
నాయకత్వ శిక్షణ వీరి ముఖ్య కార్యక్రమాలు.

సాహిత్యరంగంలో వీరు నిర్వహించిన కొన్ని బృహత్తర కార్యక్రమాల వివరాలు :

1. అనువాదకునిగా :

అకుంఠిత దీక్షతో 17 సం||లు అవిరళకృషిసల్పి క్యాథలిక్ బైబులులోని పూర్వవేదాన్ని జనరంజకంగా తెలుగులోనికి అనువదించారు.

2. ఆధ్యాత్మికవేత్తగా

: ఆధ్యాత్మిక చింతనకు పెద్దపీట వేస్తూ ఆయన నడిపే బైబుಲು భాష్యం పత్రిక, బైబులు గ్రంథమాల ఆయన ఆధ్యాత్మికరంగంలో నిత్యకృషీవలుడని చెప్పకనే చెబుతాయి.

3. విద్యార్థి బాంధవునిగా

: విద్యార్ధిలోకాన్ని ఉత్తేజపరచడానికి, వారిలో నవచైతన్యం నింపడానికి ఆయన నడిపే చైతన్యవాణి పత్రిక, విద్యార్ధిహిత గ్రంథమాల, విద్యార్ధిలోకానికే నిర్దేశకాలు.

4. వక్తగా :

ఆంధ్రరాష్ట్రమంతటా తిరిగి విద్యార్థులకు,ఉపాధ్యాయులకు, ఉపదేశకులకు సామాన్యప్రజానీకానికి వందలకొలది సదస్సులు నిర్వహించి, వారిలో నవ్యోత్సాహాలను నింపారు.