పుట:Bhoojaraajiiyamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజచరిత్ర

29


తోఁటయును జూడలేదు మందునకు నైన
నగవు గా దిది నిక్క మా నట్టునందు.

5


క.

ఆలిని బిడ్డలఁ బ్రోచుట
కై లాఘవవృత్తి కగ్గ మై నిర్ధనతా
బీలపయోధి మునుంగుచుఁ
దేలుచు దరి దాపు లేక తిరుగుచునుండెన్.

6


వ.

ఇట్లు సర్వశూన్యం బగు దారిద్ర్యదైన్యంబు సైరింపం జాలక సంసారంబు
వలన విసివి, పంకనిర్మగ్నం బగు గోవునుంబోలె నమ్మహీదేవుండు తన్ను
సముద్ధరింప దిక్కెవ్వరు లేక దుఃఖంబునఁ గృశశరీరుండై యుండఁ గొండొక
కొలంబు సనుటయు నొక్కనాఁడు తన మనంబున నిట్లని చింతించె.

7


ఉ.

ఓలి గృహస్థధర్మముల నుండెడువానికి గ్రాసవాసమున్
చాలఁగఁ గల్లి పుత్రులుఁ గళత్రము సౌఖ్యము నొంద, బంధువుల్
మే లన నార్యకోటి మది మెచ్చఁగ నుండుట యున్కి, గాక యే
చాలును లేక యీ చెనఁటిజాలిఁ బడం దిని యేమి చెప్పుమా.

8


తే.

కుడిచి కట్టినయునికి గా కిడుమఁ బడుచు
నింట నిట్లున్నఁ బురుషార్ధ మేమి కలదు?
కడఁగి యిహ మైనఁ బర మైనఁ గాక తాన
యూరకుండుట నరునకుఁ బౌరుషంబె?

9


ఉ.

లావు గలంతకాలముఁ దొలంగక తాల్చితిఁ బెక్కుభంగులన్
జీవనభార, మిప్డు ముదిసెం దల యంచుఁ బరోక్షసాధనా
భావము నెమ్మదిం దలఁచి భవ్యపథంబున నిశ్చితాత్ముఁడై
యా వసుధామరుం డరిగె నయ్యఘనాశిని యైన కాశికిన్

10


వ.

ఇట్లేఁగి.

11


ఉ.

నిచ్చలు గంగకుం జని వినిర్మలవారిఁ బవిత్రగాత్రుఁడై
వచ్చి శివాలయంబులును వైష్ణవధామములుం గ్రమంబునన్
జొచ్చి నమస్కరించుచును సువ్రతశీలుఁ డనంగఁ గాశిలో
మచ్చిక యుల్లసిల్లఁ బలుమాఱును బెద్దలయిండ్ల కేఁగుచున్.

12