పుట:Bharatiyanagarik018597mbp.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతీయ నాగరికతా విస్తరణము.

6. చంపా రాజ్యము.

ఇండోచైనాయనునది మలేద్వీపకల్పమునకును, చైనాకును మధ్యగల దేశము. ఇందు నేడు నయాం రాజ్యమును ఫ్రెంచి ఇండొచైనాయును గలవు. భారతీయనాగరికతా విస్తరణచరిత్రమున కీభాగము మిగులముఖ్యమైనది. పూర్వ మిందు చంపా, కాంభోజ యను హిందూరాజ్యములును, నేటికినివర్దిల్లుచున్న నయాం రాజ్యము నుండెడివి. హిందూదేశనాగరికతా భినివేశము లిట విజృంభించియుండుటచే వీని చరిత్రమును సంగ్రహముగ బేర్కొనవలసియున్నది.

నేటి అన్నాంలోని క్వాంగ్‌నాం (Quang-nam) బిన్ తూన్ అన్ (Bin Thuan) అను దక్షిణభాగములు పూర్వపు చంపారాజ్యములో నుండినవి. ప్రాచీన యాత్రికుల కీరాజ్యము పరిచితమై యుండెను. క్రీ. శ. 2 వ శతాబ్దమునాటి టాలెమీ యను గ్రీసుదేశీయుడు దీనిని "జబ" యని పేర్కొనినాడు. మార్కుపోలో దీనిని "అజంబ" యనెను. అరబ్బులవ్రాతలలో నీరాజ్యమునకు "కౌఫ్" అను పేరున్నది. హ్యూన్‌ష్వాంగ్ దీనిని "మోహోచంపో" (మహాచంపా) యని ప్రశంసించియున్నాడు. హిందూ దేశమున చంపారాజ్యము సుప్రసిద్ధమైయున్నది. దానినుండి యీభారతేతర రాజ్యమును విడమరచుటకై హ్యూన్‌ష్వాంగ్ దీనిని మహాచంపాయని పేర్కొనియుండెను. చైనాదేశ చరిత్రమున నీచంపారాజ్యమునకు "లిస్‌ఈ" యను నామ మొసంగబడియున్నది.